అవన్నీ అక్రమ నిర్మాణాలే | - | Sakshi
Sakshi News home page

అవన్నీ అక్రమ నిర్మాణాలే

Jul 29 2026 12:10 AM | Updated on Jul 29 2026 12:10 AM

రాప్తాడు రూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం మన్నీల గ్రామం సర్వే నంబరు 26లోని ప్రభుత్వ భూమిలో కుంటను పూడ్చి.. అక్కడ నిర్మించిన భవనం, వేసిన ఫెన్సింగ్‌ అన్నీ అనుమతి లేనివేనని తేలింది. దీంతో అక్రమ నిర్మాణాలు చేపట్టిన సదరు సంస్థకు తహసీల్దారు ఉదయ్‌భాస్కర్‌ నోటీసు జారీ చేశారు. వాస్తవానికి సర్వే నంబరు 28లో సదరు సంస్థ మైనింగ్‌కు అనుమతులు పొందింది. అయితే పక్కనే ఉన్న 26 సర్వే నంబరులోని ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్నారు. అక్కడ వర్షపు నీటికుంట ఉండేది. కొండపై నుంచి వచ్చే వర్షపునీరు కుంటలో చేరుతుండడంతో భూగర్భ జలాలు పెరిగేవి. పశువులు, మేకలు, గొర్రెలకు తాగునీటి వనరుగా ఉపయోగపడేది. ఇలాంటి కుంటను పూడ్చేశారు. దీంతో వర్షపు నీరంతా చుట్టుపక్కల పొలాల్లోకి చేరి నిల్వ ఉంటూ పంటలు దెబ్బతింటున్నాయి. దీనికితోడు కుంట కనుమరుగు కావడంతో భూగర్భజలాలు అడుగంటి బోర్లు ఎండిపోతున్నాయి. కంకర ఫ్యాక్టరీ నుంచి వస్తున్న వేస్ట్‌మట్టి తీసుకొచ్చి 26 సర్వే నంబరు భూమిలో డంప్‌ చేస్తున్నారు. రైతుల గోడుపై ‘సాక్షి’లో ఇటీవల ‘కుంటను మింగేశారు’ శీర్షికతో ప్రత్యేక కథనం వెలువడింది. ఈ కథనంపై కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్‌ స్పందించి విచారణకు ఆదేశించారు. మరోవైపు స్థానిక రైతులు తరచూ అధికారులను కలిసి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో క్షేత్రస్థాయిలో వీఆర్‌ఓ, గ్రామ సర్వేయర్‌ విచారణ చేపట్టగా సర్వే నంబర్‌–26లోని 3.41 ఎకరాల ప్రభుత్వ భూమిలో సుమారు 0.03 సెంట్ల విస్తీర్ణంలో కార్యాలయ భవనం నిర్మించడంతో పాటు తాత్కాలిక ఇనుప ఫెన్సింగ్‌ ఏర్పాటు చేసినట్లు, ఇందుకు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతి లేదా లీజు పొందలేదని తేలింది. ఈ నేపథ్యంలో సంస్థ యాజమాన్యానికి తహసీల్దార్‌ ఉదయ్‌ భాస్కర్‌ మంగళవారం నోటీసు జారీ చేశారు. మూడు రోజుల్లోగా కార్యాలయ భవనం, ఫెన్సింగ్‌ తొలగించాలని ఆదేశించారు.

కుంట పూడ్చివేతపై కదిలిన రెవెన్యూ యంత్రాంగం

మూడు రోజుల్లో భవనం, ఫెన్సింగ్‌ తొలగించాలంటూ సంస్థకు నోటీసు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement