● కూడేరు సీఐ రాజు నిర్వాకం
అనంతపురం సెంట్రల్: కూడేరు సీఐ రాజు వ్యవహార శైలి పోలీసుశాఖలో చర్చనీయాశంగా మారుతోంది. ప్రభుత్వ వాహనాన్ని మూలనపడేసి.. సొంత కారులో తిరుగుతూ ప్రభుత్వం నుంచి నెలనెలా డీజిల్ డ్రా చేస్తున్నట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే... పోలీసుశాఖలో ఎస్‌ఐల దగ్గర నుంచి సీఐలు, డీఎస్పీలు, పైస్థాయి అధికారులతో పాటు బందోబస్తుకు వినియోగించే వాహనాలకు ఏఆర్‌లోని మోటార్ ట్రాన్స్‌పోర్టు విభాగం నుంచి డీజిల్ మంజూరు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా దాదాపు 200 పైచిలుకు వాహనాలున్నట్లు సమాచారం. వాటన్నింటికీ కోర్టురోడ్డులోని పోలీసు పెట్రోల్ బంకు నుంచే డీజిల్ పంపిణీ జరుగుతోంది. నెలకు సీఐకు 120 లీటర్లు, ఎస్‌ఐలకు 100 లీటర్లు చొప్పున మంజూరు చేస్తారు. అయితే గత కొన్ని నెలలుగా కూడేరు సీఐ వాహనం మూలనకు పడేశారు. అంతకుముందు ఉన్న సీఐలందరూ అదే వాహనంలో విధులు నిర్వర్తించారు. ఆ సారు మాత్రం అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్న టాటా సుమో వాహనాన్ని ఏఆర్ హెడ్‌క్వార్టర్‌కు చేర్చారు. ఏ కారణం చేతైనా ప్రభుత్వ వాహనం వినియోగించకపోతే సదరు పోలీసు అధికారి ఎస్పీ అనుమతి తీసుకొని ప్రైవేటు వాహనాలను వినియోగించాలి. అది కూడా రోజుల వ్యవధి మాత్రమే. కానీ నిబందనలకు విరుద్ధంగా సదరు సీఐ దాదాపు ఏడాది కాలంగా తన సొంత కారులోనే ప్రయాణిస్తున్నారు. అందుకు సంబంధించి డీజిల్ మాత్రం నెలానెలా ప్రభుత్వ కారు నంబర్‌పైనే తీసుకుంటున్నట్లు సమాచారం.
మా దృష్టికి రాలేదు
సీఐ రాజు వాడుతున్న వాహనం మరమ్మతులకు వచ్చిన విషయం మా దృష్టికి రాలేదు. నిబంధనల ప్రకారం ప్రైవేటు వాహనానికి డీజిల్ ఇవ్వ కూడదు. ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్న వాహనానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. అసలు ఆ వాహనం ఎందుకు మూలన పెట్టారు. డీజిల్ వినియోగం ఎలా చేస్తున్నారనే విషయం తెలుసుకుంటాను.
– ఇలియాజ్ బాషా, అదనపు ఎస్పీ, ఏఆర్


