సమష్టి కృషితోనే ఎస్కేయూకు పూర్వ వైభవం | - | Sakshi
Sakshi News home page

సమష్టి కృషితోనే ఎస్కేయూకు పూర్వ వైభవం

Jul 29 2026 12:04 AM | Updated on Jul 29 2026 12:04 AM

వీసీ జ్యోతికుమార్‌

అనంతపురం: బోధన, బోధనేతర ఉద్యోగుల సమష్టి కృషితోనే శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయానికి పూర్వ వైభవం సాధ్యమని వీసీ ప్రొఫెసర్‌ ఎన్‌వీఆర్‌ జ్యోతి కుమార్‌ పేర్కొన్నారు. ఎస్కేయూ 45వ ఆవిర్భావ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీసీతో పాటు ప్రముఖ తెలుగు పండితుడు, తెలుగు మాజీ ప్రొఫెసర్‌ శలాక రఘునాథ శర్మ, గౌరవ అతిథులుగా ద్రావిడ వర్సిటీ వీసీ ప్రొఫెసర్‌ చిన్న మల్లయ్య లక్కినేని, జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శనరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వీసీ ప్రొఫెసర్‌ జ్యోతి కుమార్‌ మాట్లాడుతూ 45 సంవత్సరాల క్రితం నాటిన చిన్న విత్తనం నేడు మహావృక్షంగా ఎదిగిందని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయంలో నాణ్యమైన విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి, పరిశ్రమలతో భాగస్వామ్యం పెంపొందిస్తామన్నారు. త్వరలో స్నాతకోత్సవం నిర్వహిస్తామన్నారు. అటల్‌ ఇంక్యుబేషన్‌ సెంటర్‌ ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్న ఇద్దరు గ్రామీణ ఆవిష్కర్తలు నీతి ఆయోగ్‌ అటల్‌ ఇన్నోవేషన్‌ మిషన్‌ ప్రకటించిన దేశంలోని 26 మంది గ్రాస్‌రూట్‌ ఇన్నోవేటర్ల జాబితాలో చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. వీరిని జూలై 31న రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి సత్కరించనున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్‌ శలాక రఘునాథ శర్మ మాట్లాడుతూ రాయలసీమలో ఉన్నత విద్యా వికాసానికి ఎస్కేయూ అపూర్వ సేవలు అందించిందన్నారు. ద్రావిడ విశ్వవిద్యాలయం వీసీ, ఎస్కేయూ పూర్వ విద్యార్థి ప్రొఫెసర్‌ చిన్న మల్లయ్య లక్కినేని మాట్లాడుతూ, విశ్వవిద్యాలయంతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఇక్కడ చదువుకున్న వేలాది మంది దేశ విదేశాల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారని, పూర్వ విద్యార్థులంతా విశ్వవిద్యాలయ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జేఎన్‌టీయూ వీసీ ప్రొఫెసర్‌ హెచ్‌. సుదర్శనరావు మాట్లాడుతూ విశ్వవిద్యాలయాలు నైపుణ్యాధారిత విద్య, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమలతో అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.కార్యక్రమంలో రెక్టార్‌ అనిత, రిజిస్ట్రార్‌ రమేష్‌ బాబు, ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ అంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement