● నిమ్మ రైతులకు శాస్త్రవేత్తల సూచన
గుత్తి రూరల్: రైతులు నిమ్మ పంట సాగులో శాసీ్త్రయ పద్ధతులు పాటించడం ద్వారా అధిక దిగుబడి సాధించవచ్చని ఉద్యాన శాస్త్రవేత్తలు డాక్టర్ కేసీ.భానుమూర్తి, డాక్టర్ ఎం.సునీల్‌కుమార్, డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ సహాయ సంచాలకుడు బీసీ ధనుంజయలు పేర్కొన్నారు. మంగళవారం మండలంలోని కొత్తపేట గ్రామంలోని హ్యాండ్స్ స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో సీఈఓ నారాయణస్వామి ఆధ్వర్యంలో ఎల్‌నినో పరిస్థితులలో నిమ్మ తోటల నిర్వహణ, వ్యాధుల నివారణతో పాటు పునర్ వ్యవస్థీకరించిన వాతావరణ ఆధారిత పంటల బీమా పథకంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ నిమ్మ పంటల్లో వేరుకుళ్లు, ఆకుమచ్చలు, కాండం సంబంధిత వ్యాధులు, పోషక లోపాలను రైతులు గుర్తిస్తూ ఉండాలన్నారు. వాటి నివారణకు జీవ ఎరువులు, జీవ నియంత్రణ పద్ధతులు, తోటల ఆరోగ్య నిర్వహణ, వాతావరణ మార్పులకు అనుగుణంగా చేపట్టాల్సిన చర్యలను వివరించారు. అనంతరం ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ పథకం గురించి అవగాహన కల్పించారు. వాతావరణ మార్పుల వలన కలిగే పంట నష్టాల నుంచి రైతులకు ఆర్థిక రక్షణ కల్పించే ఈ పథకం అర్హత, నమోదు విధానం, ప్రయోజనాలు, బీమా పొందే ప్రక్రియను వివరించారు. రైతుల సందేహాలను శాస్త్రవేత్తలు, నిపుణులు నివృత్తి చేశారు. కార్యక్రమంలో వీఎహెచ్‌ఏలు మారుతీనాయక్, భాస్కర్, సురేంద్రబాబు, ఇన్సూరెన్సు మేనేజర్ ఎం.నారాయణస్వామి, ‘హ్యాండ్స్’ వ్యవస్థాపకుడు రామకృష్ణ, జిల్లా మేనేజర్ భాగ్య, పీఓ సురేష్ తదితరులు పాల్గొన్నారు.


