● డీఆర్‌ఎం సీఎస్ గుప్తా
గుంతకల్లు: ప్రతి ఉద్యోగి భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు నివారించవచ్చని డీఆర్‌ఎం చంద్రశేఖర్‌గుప్తా పేర్కొన్నారు. డివిజన్ పరిధిలో ప్రమాదాల నివారణకు కృషి చేసిన ఆరుగురు ఉద్యోగులకు మ్యాన్ ఆఫ్ మంత్ అవార్డులు అందజేశారు. గుంతకల్లు స్టేషన్‌కు చెందిన ట్రైనీ మేనేజర్ వై.శివ, పుల్లంపేటలో పాయింట్స్‌మెన్‌గా పని చేస్తున్న గౌరవ్ శర్మ, ఆదోని సెక్షన్‌లో టీఆర్‌డీ విభాగంలో జూనియర్ ఇంజినీర్ డీ.శ్రీహరి, గుంతకల్లు సెక్షన్‌లో కీమ్యాన్‌గా పని చేస్తున్న బీ.లీలాధర్‌తోపాటు తిరుపతికి చెందిన లోకోపైలట్ ఓఏవీ రమణ, అసిస్టెంట్ లోకోపైలట్ విక్కీకుమార్ రామ్‌లకు మంగళవారం డీఆర్‌ఎం కార్యాలయంలోని తుంగభద్ర చాంబర్‌లో అవార్డులను డీఆర్‌ఎం అందజేశారు. కార్యక్రమంలో ఏడీఆర్‌ఎం శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
కుమారుడి లేని లోకంలో ఉండలేనని తండ్రి ఆత్మహత్య
శెట్టూరు: కుమారుడి మృతితో తీవ్ర మనస్తాపం చెందిన ఓ తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన శెట్టూరు మండలంలోని చిన్నంపల్లిలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు... గ్రామానికి చెందిన గొల్ల సీగన్న (57), గొల్ల రామలక్ష్మిల ఒక్కగానొక్క కుమారుడు గొల్ల వీరేష్ (24) నాలుగు నెలల క్రితం ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడు. అప్పటి నుంచి తండ్రి సీగన్న నిత్యం ఆవేదన చెందుతుండేవాడు. కుమారుడు లేని లోకంలో ఎందుకు బతకాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్తులతో బాధపడేవాడు. ఈ క్రమంలోనే మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుని భార్య రామలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం కళ్యాణదుర్గం ఆసుపత్రికి పంపారు.
ఇద్దరు గంజాయి
విక్రేతల అరెస్టు
గుత్తి/గుత్తిరూరల్: గుత్తి పోలీసులు మంగళవారం ఇద్దరు గంజాయి విక్రేతలను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 1,130 గ్రాముల గంజాయి, ఆరు గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో సీఐ రామారావు, ఎస్‌ఐ సురేష్‌లు వివరాలు వెల్లడించారు. గుత్తికి చెందిన సాయి రాం, కొత్త ఊబిచెర్లకు చెందిన బోయ ఓబయ్యలు గుంతకల్లుకు చెందిన అంజి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి గుత్తి, పరిసర ప్రాంతాల్లో విక్రయించేవారు. రాబడిన సమాచారం మేరకు పోలీసులు కాపు కాచి ఇద్దరినీ అరెస్టు చేశారు. ఓబయ్య ఇంటి పక్కన గంజాయిని సాగు చేస్తున్నట్లు గుర్తించి, ఆరు మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా, ఎక్కడైనా గంజాయి సేవిస్తున్నా, విక్రయిస్తున్నా, సరఫరా చేస్తున్నా తమకు సమాచారం ఇవ్వాలని, అలాంటి వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్‌ఐ రామాంజనేయ రెడ్డి, హెడ్ కానిస్టేబుల్ హనుమంతు, సిబ్బంది పాల్గొన్నారు.
బైకు అదుపుతప్పి యువకుడి దుర్మరణం
గార్లదిన్నె: బైకు అదుపుతప్పి యువకుడు దుర్మరణం పాలైన ఘటన మండల పరిధిలోని తిమ్మంపేట వద్ద జరిగింది. ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపిన మేరకు.. పామిడి మండలంలోని అప్పాజిపేటకు చెందిన చంద్రశేఖర్ (30) ఓ మార్కెటింగ్ సంస్థలో పని చేస్తున్నాడు. మంగళవారం రాత్రి పామిడికి చెందిన సంజయ్ కుమార్‌తో కలిసి స్కూటీలో అనంతపురం నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. తిమ్మంపేట వద్ద స్కూటీ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. దీంతో తీవ్రగాయాలైన చంద్రశేఖర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్వల్ప గాయాలైన సంజయ్‌కుమార్‌ను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడు చంద్రశేఖర్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ బాషా తెలిపారు.


