ఉరవకొండలో టీడీపీకి బీజేపీ బినామీనా? | - | Sakshi
Sakshi News home page

ఉరవకొండలో టీడీపీకి బీజేపీ బినామీనా?

Jul 29 2026 12:04 AM | Updated on Jul 29 2026 12:04 AM

వైఎస్సార్‌సీపీ రాయలసీమ జోనల్‌ అధికార ప్రతినిధి కేవీ రమణ

అనంతపురం సిటీ: ఉరవకొండ నియోజకవర్గంలో పసుపు రంగు మాటున కాషాయం కనుమరుగవుతోందని వైఎస్సార్‌సీపీ రాయలసీమ జోనల్‌ అధికార ప్రతినిధి కేఈ రమణ విమర్శించారు. నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమాలు, అన్యాయాలను నిరసిస్తూ ఈ నెల 31న అక్కడి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ధర్నాకు పిలుపునిస్తే కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ఓ శిఖండిలా బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజేష్‌ను మంత్రి పయ్యావుల కేశవ్‌ వాడుకుంటూ చేస్తున్న ప్రయత్నాలే ఇందుకు నిదర్శమని పేర్కొన్నారు. జిల్లా వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓ జాతీయ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్న కడదరకుంట రాజేష్‌కు తన ఇంటి ముందే జరుగుతున్న హంద్రీ–నీవా కాలువ పనుల్లో అక్రమాలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. తన సొంత మండలంలోని ముద్దలాపురం, ఇప్పేరు చెరువులకు నీరు అందకుండా పయ్యావుల అడ్డు వేస్తే కనీసంగానూ ప్రశ్నించలేకపోతున్నాడని విమర్శించారు. విడపనకల్లు మండలం వేల్పుమడుగు సర్వేనంబర్‌ 141లో 21.50 ఎకరాల భూమి కురుబ గోవిందు కొనుగోలు చేశాడని, అయితే ఈ భూమి దేవదాయ శాఖకు చెందినదిగా పెడదోవ పట్టించే ప్రయత్నం చేయడం సిగ్గుచేటన్నారు. సాక్షాత్తూ కలెక్టరే ఎండార్స్‌ ఇచ్చినా ప్రజలను మభ్య పెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, భూమిలోకి పయ్యావుల అనుచరులైన జనార్దనపల్లికి చెందిన సుధాకర్‌నాయుడు, పాండురంగనాయుడు, మాజీ సర్పంచ్‌ రాయంకి జనార్దన నాయుడు దౌర్జన్యంగా ప్రవేశించి బోర్లు ధ్వంసం చేయడం, పైపులు ఎత్తుకెళ్లడం, భారీ వృక్షాలను నరికి విక్రయించుకోవడంపై రాజేష్‌ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. వైఎస్సార్‌సీపీ మహాధర్నాకు విరుద్ధంగా ప్రకటనలు ఇవ్వడం చూస్తుంటే ఆయనకు టీడీపీ ద్వారా ఎంత లెక్క ముట్టిందో చెప్పాలన్నారు. సమావేశంలో సీనియర్‌ న్యాయవాది హరినాథరెడ్డి, వైఎస్సార్‌సీపీ నేతలు కురుబ దేవేంద్ర, కురుబ రామచంద్ర, కురుబ గోవిందు, కురుబ సురేష్‌, బెస్త తిరుపాల్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement