● పెట్రోల్ బాటిళ్లతో బ్యాంక్ మేనేజర్ ఎదుట రైతుల బైఠాయింపు
బ్రహ్మసముద్రం: రైతు సమస్యలపై అలసత్వం తగదని పలువురు మండిపడ్డారు. మండలంలోని వేపులపర్తి యూనియన్ బ్యాంక్‌లో పంట రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వడ్డీ చెల్లించినా రెన్యూవల్ చేయలేదంటూ మంగళవారం బ్యాంక్ ఎదుట ఆందోళన చేపట్టారు. న్యాయం చేయకుంటే పెట్రోల్ పోసుకుంటామని రైతులు హెచ్చరించారు. వీరికి వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం నియోజకవర్గ కార్మిక సంఘం అధ్యక్షుడు తలారి సంజీవయ్య మద్దతుగా నిలిచారు. కాయకష్టం చేసుకునే రైతులను వేధించడం తగదన్నారు. రూ.3 లక్షలకు ఏడాది వడ్డీ రూ.21 వేలే అయినా రూ. 31 వేలు కట్టించుకుని రైతులను మోసం చేస్తున్నారన్నారు. మేనేజర్ శ్రీను మాట్లాడుతూ బ్యాంక్‌లో ఇంతకు ముందు పనిచేసిన సిబ్బంది తప్పిదంతో ఇలా జరిగిందని రైతులకు తెలియజేశారు. ఉన్నతాధికారుల దృష్టికి సమస్య తీసుకెళ్లి బాధిత రైతులందరికీ న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మాజీ మండల కన్వీనర్ కేపీ బసవరాజు, నాయకులు పడమటి కోడిపల్లి మోహన్, గౌడప్ప, చంద్ర, గొల్లబసవరాజు, నాగరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


