వ్యవసాయ ప్రణాళిక అమలులో చంద్రబాబు సర్కార్‌ విఫలమయ్యింది. కీలకమైన ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. నైరుతి కూడా వచ్చేస్తోంది. అయితే సకాలంలో విత్తనం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈసారి కూడా రైతులకు కష్టాలు తప్పేలా లేవు. వేరుశనగ సాగు తగ్గించినట్లు చె | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ ప్రణాళిక అమలులో చంద్రబాబు సర్కార్‌ విఫలమయ్యింది. కీలకమైన ఖరీఫ్‌లో తొలకరి వర్షాలు పలకరిస్తున్నాయి. నైరుతి కూడా వచ్చేస్తోంది. అయితే సకాలంలో విత్తనం అందే పరిస్థితి కనిపించకపోవడంతో ఈసారి కూడా రైతులకు కష్టాలు తప్పేలా లేవు. వేరుశనగ సాగు తగ్గించినట్లు చె

Jun 6 2026 12:29 AM | Updated on Jun 6 2026 12:29 AM

అనంతపురం అగ్రికల్చర్‌: ఖరీఫ్‌–2026 సాగుకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు 1.28 లక్షల క్వింటాళ్ల విత్తన వేరుశనగ సేకరించి నిల్వ చేయాలని ఏపీ సీడ్స్‌కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇందులో అనంతపురం జిల్లాకు 56 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాకు 72 వేల క్వింటాళ్ల విత్తన వేరుశనగ 40 శాతం రాయితీపై అందిస్తామని ప్రకటించారు. నిధులు విడుదల చేయకుండా ఉత్తచేతులతో సేకరించడం తమ వల్ల కాదని ఏపీ సీడ్స్‌ చేతులెత్తేసింది. తీవ్ర ఒత్తిళ్ల మధ్య విత్తన పంపిణీ ప్రక్రియ మూడు రోజుల కిందటే మొదలు పెట్టారు. అనంతపురం జిల్లాలో 10, శ్రీసత్యసాయి జిల్లాలో రెండు... మొత్తం 12 ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో విత్తనశుద్ధి చేసి సరఫరా చేయాలని ఆదేశించారు. కానీ... అన్ని ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో నిల్వ ఉన్న విత్తనకాయలు 20 వేల క్వింటాళ్లు మాత్రమేనని లెక్క వేశారు. ఈ పరిస్థితుల్లో కేటాయించిన మేరకు విత్తనం ఎక్కడి నుంచి సేకరించి నిల్వ చేస్తారో.. సకాలంలో రైతులకు ఎలా అందిస్తారో చంద్రబాబు ప్రభుత్వం, వ్యవసాయశాఖ, ఏపీ సీడ్స్‌ అధికారులు స్పష్టత ఇవ్వడం లేదు.

బకాయిలతోనే విత్తన సమస్య..

గతేడాది ఖరీఫ్‌, రబీలో పంపిణీ చేసిన విత్తన వేరుశనగకు సంబంధించి ప్రాసెసింగ్‌ ప్లాంట్ల నిర్వాహకులకు చంద్రబాబు ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా దాటవేత ధోరణి అవలంబించడంతో ఏపీ సీడ్స్‌కు ఇప్పుడు విత్తన సమస్య ఎదురవుతోంది. ఏడాది కాలంగా రూ.90 కోట్లు ఇవ్వకుండా జాప్యం చేసింది. బకాయిలు చెల్లించకపోతే విత్తనం అందించలేమని చేతులెత్తే పరిస్థితి ఉండటంతో రెండు రోజుల కింద సగం మొత్తం ఇచ్చినట్లు చెబుతున్నారు. రూ.కోట్లలో బకాయిలు పడటంతో తాము వడ్డీలు కూడా చెల్లించలేని దుస్థితిలో ఉన్నట్లు మిల్లర్లు వాపోతున్నారు. అదే బకాయిలు పూర్తి స్థాయిలో గతంలోనే చెల్లించివుంటే రబీలో పండిన వేరుశనగను రైతుల నుంచి కొనుగోలు చేసి నిల్వ చేసుకునే పరిస్థితి ఉండేదని చెబుతున్నారు. గత రబీలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 28 వేల హెక్టార్లలో పండిన 2.80 లక్షల క్వింటాళ్లకు పైగా వేరుశనగను రైతుల నుంచి కర్ణాటక, తమిళనాడు, బళ్లారి, ఇతర ప్రాంతాల వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకుపోయినట్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు మనకు విత్తనం కావాలంటే తిరిగి తమిళనాడు, కర్ణాటక, ఇతర జిల్లాలపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోతున్నారు.

ఆర్‌ఎస్‌కేలకు చేరింది 5 వేల క్వింటాళ్లే

రాష్ట్ర ప్రభుత్వం పాతబకాయిలు సగమే చెల్లించడంతో కొందరు మిల్లర్లు మాత్రమే విత్తనశుద్ధి మొదలు పెట్టారు. 12 ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో ఇంకా బెళుగుప్ప, ధర్మవరం, గుత్తి, కదిరి ప్రాంతాల్లో మొదలు కాలేదు. అంతో ఇంతో సొమ్ము వచ్చిందని తెలుసుకున్న ఒక ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ నిర్వాహకుడి ఇంటి దగ్గరకు అప్పులవాళ్లు వచ్చి తాము ఇచ్చిన అసలు, వడ్డీ తీసుకెళ్లారు. అయినా ఇంకా రూ.50 లక్షల వరకు అప్పు మిగలడంతో లబోదిబోమంటూ ఈసారి విత్తనశుద్ధి చేయలేనని చేతులెత్తేసినట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం అనంతపురం జిల్లాలో 4 వేల క్వింటాళ్లు, శ్రీసత్యసాయి జిల్లాలో వేయి క్వింటాళ్లు ప్రాసెసింగ్‌ యూనిట్ల నుంచి రైతు సేవ కేంద్రా(ఆర్‌ఎస్‌కే)లకు మొత్తం 5 వేల క్వింటాళ్ల విత్తన కాయలు మాత్రమే చేరాయి. పరిస్థితి చూస్తే ఈసారి కూడా కేటాయించిన రైతులకు పూర్తిస్థాయిలో విత్తనం అందే పరిస్థితి కనిపించడం లేదు.

ఉమ్మడి జిల్లాకు 1.28 లక్షల

క్వింటాళ్ల వేరుశనగ కేటాయింపు

ప్రాసెసింగ్‌ ప్లాంట్లలో అందుబాటులో ఉన్నది 20 వేల క్వింటాళ్లు

బకాయిలు తీవ్ర జాప్యం చేయడంతో కొనలేని పరిస్థితిలో మిల్లర్లు

రబీలో పండిన వేరుశనగ ఇతర ప్రాంతాలకు తరలిపోయిన దుస్థితి

ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి

తెప్పించాలని మిల్లర్లు, ఏపీ సీడ్స్‌పై ఒత్తిడి

Advertisement
 
Advertisement
Advertisement