● పనుల పరిశీలనకు వెళ్లిన అధికారికి బెదిరింపులు
● తనిఖీలు చేస్తే కాళ్లూచేతులు నరికేస్తామంటూ వార్నింగ్!
తాడిపత్రిటౌన్: ఉపాధి హామీ పనులు అధికార పార్టీ నేతలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. తమ పార్టీ ద్వారా ఫీల్డ్ అసిస్టెంటు పోస్టుల్లోకి వచ్చిన వారితో కుమ్మకై ్క అక్రమాలకు పాల్పడుతున్నారు. కూలీల ద్వారా చేయించాల్సిన పనులను జేసీబీలతో చేయించడం.. బిల్లుల కోసం కూలీల ఫొటోలు అప్‌లోడ్ చేయడం పరిపాటిగా మార్చుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో పనులను పరిశీలించేందుకు వెళ్లే అధికారులకు ‘పచ్చ’ నేతల నుంచి బెదిరింపులు వస్తున్నాయి. పెద్దపప్పూరు మండలంలో వారం రోజుల కిందట జరిగిన ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. పెద్ద ఎక్కలూరులో ఉపాధి హామీ పనులను రాత్రిపూట జేసీబీలు పెట్టి చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఉదయం పూట తమకు అనుకూలమైన కూలీలతో పనులకు హాజరైనట్లు ఫొటోలు తీసి, యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి కూలీలతో పనులు చేయించాలి. కానీ అధికార పార్టీ నాయకులు ఉపాధి పనులను తమకు ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీలతో చేయించి.. కూలి సొమ్మును కూలీలకు సగం ఇచ్చి.. మిగతాది తమ జేబులు నింపుకుంటున్నారు. ఇటీవల పనుల పరిశీలన కోసం వచ్చిన మండలస్థాయి ఉపాధి అధికారిని టీడీపీ నేతలు కలిశారు. ‘ఇక్కడ మీరేమీ పనులు చూడక్కర్లేదు. కాదని తనిఖీలు చేయాలని చూస్తే కాళ్లూచేతులు నరికేస్తా’ జాగ్రత్త అంటూ హెచ్చరించినట్లు తెలిసింది. ఈ విషయంలో గ్రామంలో ఆనోటా.. ఈనోటా పడి బయటకు వచ్చింది. ఇదిలా ఉండగా చెర్లోపల్లిలోనూ సదరు అధికారికి చేదు అనుభవం ఎదురైంది. ఏకంగా క్షేత్రస్థాయి సిబ్బంది మద్యం మత్తులో ఆయనపై దురుసుగా మాట్లాడినట్లు తెలిసింది. ఈ విషయమై సదరు మండలస్థాయి అధికారిని ‘సాక్షి’ వివరణ కోరితే క్షేత్రస్థాయి సిబ్బంది దురుసుగా ప్రవర్తించిన మాట వాస్తవమేనని అంగీకరించారు. అయితే బెదిరింపుల విషయాన్ని దాటవేశారు.


