జిల్లాలో విలువైన ఖనిజంతో పాటు మట్టిని సైతం వదలకుండా కూటమి పార్టీ నాయకులు దోచేస్తున్నారు. గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కొండ గుట్టలను కరిగించేస్తున్నారు. ఈ అక్రమ దందా వాస్తవమని తెలిసినా రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు దారితప్పి పూర్తిగా సహకర | - | Sakshi
Sakshi News home page

జిల్లాలో విలువైన ఖనిజంతో పాటు మట్టిని సైతం వదలకుండా కూటమి పార్టీ నాయకులు దోచేస్తున్నారు. గనుల శాఖ నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే కొండ గుట్టలను కరిగించేస్తున్నారు. ఈ అక్రమ దందా వాస్తవమని తెలిసినా రెవెన్యూ, భూగర్భ గనుల శాఖ అధికారులు దారితప్పి పూర్తిగా సహకర

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

నేమకల్లులో రోడ్డు మెటల్‌ క్వారీలో సాగుతున్న తవ్వకాలు

శెట్టూరు మండలం యాటకల్లులో సీజ్‌ చేసిన క్వారీ

జిల్లాలో వెలుగు చూస్తున్న అక్రమాలు

పర్మిట్లు లేకుండా విలువైన ఖనిజాన్ని తరలిస్తున్న వైనం

లీజు పేరిట ప్రభుత్వ భూముల ఆక్రమణ

అక్రమార్కులకు ప్రజాప్రతినిధుల అండ

చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్న అధికారులు

అనంతపురం టౌన్‌: జిల్లాలోనే అత్యధికంగా రోడ్డు మెటల్‌ క్వారీలున్న రాయదుర్గం నియోజకవర్గంలో అక్రమ దందా పెద్ద ఎత్తున సాగుతోంది. కూటమి పార్టీల నేతల అండ చూసుకుని కొందరు క్వారీ నిర్వాహకులు ఎలాంటి పర్మిట్లు లేకుండా తవ్వకాలు సాగిస్తున్నారు. బొమ్మనహాల్‌ మండలం నేమకల్లు సమీపంలోని క్వారీ నుంచి రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న తవ్వకాలను గుర్తించిన విజిలెన్స్‌ అధికారులు 2021లో సదరు క్వారీ నిర్వాహకులకు రూ.కోట్ల మేర జరిమానాలు విధించారు. అయితే రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఖనిజం అక్రమ రవాణా ఊపందుకుంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో క్వారీ నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. గుట్టు చప్పుడు కాకుండా తవ్వకాలు సాగిస్తూ రోడ్డు మెటల్‌ను అక్రమంగా తరలించేస్తున్నారు. అలాగే అనంతపురం రూరల్‌ మండలం తాటిచెర్ల సమీపంలో ఉన్న ఎర్రమట్టి కొండ గుట్టలు కాస్త కరిగిపోతున్నాయి. మట్టి తరలింపునకు ఎలాంటి లీజు అనుమతులు తీసుకోకుండానే పెద్ద ఎత్తున దందా సాగిస్తున్నారు. ఫలితంగా ఏటా ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. కాగా, ఈ అక్రమాలపై గనుల శాఖ ఇన్‌చార్జ్‌ ఏడీ అమీర్‌బాషాను వివరణ కోరేందుకు ‘సాక్షి’ ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.

మచ్చుకు కొన్ని...

రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాళ్‌ మండలం నేమకల్లు సమీపంలో రోడ్డు మెటల్‌ క్వారీలు అధిక సంఖ్యలో ఉన్నాయి. ఇక్కడి నుంచి రోడ్డు మెటల్‌ను కర్ణాటక ప్రాంతానికి పెద్ద ఎత్తున తరలిస్తారు. కూటమి పార్టీలకు చెందిన కొందరు క్వారీ నిర్వాహకులు ప్రభుత్వానికి ఎలాంటి రాయల్టీ చెల్లించకుండానే రోడ్డు మెటల్‌ను తవ్వేసి అక్రమంగా కర్ణాటక ప్రాంతానికి రవాణా చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం. ఖనిజాన్ని తరలించాలంటే గనులశాఖ అధికారుల నుంచి ఆన్‌లైన్‌ పర్మిట్లు తీసుకోవాల్సి ఉంది. ఈ అక్రమ తవ్వకాల వెనుక స్థానిక ప్రజాప్రతినిధి అండ ఉండడంతో అధికారులు సైతం అటు వైపుగా కన్నెత్తి చూడడం లేదు.

అనంతపురం రూరల్‌ మండలం మన్నీల గ్రామ సర్వే నంబర్‌ 26లో దాదాపు 13ఎకరాల విస్తీర్ణంలోని ప్రభుత్వ భూమిని ఓ క్వారీ నిర్వాహకుడు ఆక్రమించుకున్నాడు. ఈ ప్రభుత్వ భూమి పక్కనే రోడ్డు మెటల్‌ క్వారీకి అనుమతులు తీసుకుని ప్రభుత్వ భూమిలోని కుంటలను సైతం పూడ్చి వేసి శాశ్వత భవనాలు, క్రషర్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇదే విషయంపై రెవెన్యూ, గనులశాఖ అధికారులకు స్థానిక ప్రజలు, రైతులు ఫిర్యాదు చేశారు. అయినా అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్వారీ నిర్వాహకుడు కూటమి పార్టీకి చెందిన వ్యక్తి కావడంతో అక్రమాలను అధికారులు సైతం నిలువరించలేకపోతున్నట్లుగా తెలుస్తోంది. క్వారీ మాటున ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నా చోద్యం చూడడం మినహా తామేమీ చేయలేకపోతున్నామంటూ రెవెన్యూ అధికారులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలోనే క్వారీ వైపుగా ఎవరూ కాలు పెట్టేందుకు వీలు లేకుండా ప్రజాప్రతినిధుల నుంచి అధికారులపై ఒత్తిడి తీసుకెళ్లిన నిర్వాహకుడు ప్రభుత్వ భూమి చుట్టూ పటిష్టమైన ప్రహరీని ఏర్పాటు చేసుకోవడం గమనార్హం.

కళ్యాణదుర్గం నియోజకవర్గం శెట్టూరు మండలం యాటకల్లు సమీపంలో సర్వే నంబర్‌ 185లో 1.70హెక్టార్లలో రోడ్డు మెటల్‌ క్వారీకి అనుమతులు ఉన్నాయి. అయితే నిబంధనలకు విరుద్దంగా తవ్వకాలు చేసి రోడ్డుమెటల్‌ను తరలించారు. దాదాపు 7వేల క్యూబిక్‌ మీటర్లకు పైగా అక్రమంగా తవ్వకాలు సాగినట్లుగా అధికారులు సైతం గుర్తించారు. దీంతో క్వారీ నిర్వాహకుడికి రూ.43లక్షల మేర జరిమానా విధిస్తూ 2024 మే నెలలో నోటీసులను జారీ చేశారు. అయితే ప్రభుత్వానికి పైసా కూడా చెల్లించకుండానే ప్రస్తుతం అదే క్వారీలో అక్రమంగా తవ్వకాలు సాగిస్తూ రాత్రికి రాత్రే రోడ్డు మెటల్‌ను తరలించేస్తున్నారు. నిత్యం ఇదే తంతు కొనసాగుతున్నా అధికారులు మాత్రం చర్యలు తీసుకునేందుకు భయపడుతున్నారు. ఈ క్వారీ నిర్వాహకుడికి స్థానిక ప్రజాప్రతినిధి అండ పుష్కలంగా ఉండడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement