అనంతపురం అర్బన్: భారత స్వాతంత్య్ర చరిత్రలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు ఓ మహోజ్వల శక్తిగా ఖ్యాతిగాంచారని డీఆర్వో ఎ.మలోల అన్నారు. నాడు అల్లూరి జరిపిన సాయుధ పోరాటం స్వాతంత్రోద్యమంలో ఓ ప్రత్యేక అధ్యాయంగా నిలిచిందన్నారు. కలెక్టరేట్‌లోని రెవెన్యూభవన్‌లో గురువారం అల్లూరి సీతారామరాజు వర్ధంతి నిర్వహించారు. అల్లూరి చిత్రపటానికి డీఆర్వో, తదితరులు పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడారు. సాయుధ పోరాటం ద్వారానే దేశానికి స్వాతంత్య్రం వస్తుందని తాను నమ్మిన దిశగానే ప్రయాణిస్తూ ప్రాణాలను అర్పించిన మహోయోధుడు అల్లూరి సీతారామారాజు అని కొనియాడారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమాధికారి శ్రీనివాసులు, డీఐపీఆర్‌ఓ బాలకొండయ్య, హెచ్‌డబ్ల్యూఓ చంద్రశేఖర్‌బాబు, గిరిజన సంఘం నాయకులు పోలా వీరాంజనేయులు, సాకే చిరంజీవి పాల్గొన్నారు.
ఆటో బోల్తా..
మహిళా కూలీ మృతి
బెళుగుప్ప: ఆటో బోల్తాపడిన ఘటనలో ఓ మహిళా కూలీ దుర్మరణం పాలైంది. పోలీసులు తెలిపిన మేరకు.. బెళుగుప్ప మండలం ఎర్రగుడి గ్రామానికి చంఎదిన మహిళా కూలీలు గురువారం ఉదయం వెంకటాద్రిపల్లిలో ఓ రైతు పొలంలో టమాట మొక్కలు నాటేందుకు కూలి పనికి సిద్ధమై ఆటోలో బయలుదేరారు. మార్గం మధ్యలో రాధాకృష్ణ తోట వద్దకు చేరుకోగానే డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ప్రధాన రహదారిపై ఆటో బోల్తాపడింది. తలకు తీవ్ర గాయమైన కూలీ హరిజన గంగమ్మ (67) అక్కడికక్కడే మృతి చెందింది. మరికొందరికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మృతురాలి కుమారుడు లక్ష్మన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, ఆటో డ్రైవర్ పాతన్నను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్‌ఐ శివ తెలిపారు.
‘పది’ విద్యార్థులకు
పతిభా పురస్కారాలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో ప్రతిభ చాటిన విద్యార్థులకు కులమతాలకు అతీతంగా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ (ఏపీఎస్‌ఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షుడు ఆకుల రాఘవేంద్ర ప్రకటించారు. గురువారం స్థానిక ఫెడరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పదో తరగతిలో 550 ఆపై మార్కులు సాధించిన వారికి ప్రతిభా పురస్కారాలు అందజేస్తామన్నారు. అర్హులైన విద్యార్థులు ఈ నెల 13వ తేదీలోపు మార్కుల జాబితా, ఆధార్ కార్డు, టీసీ లేదా స్టడీ సర్టిఫికెట్, రెండు ఫొటోలతో కూడిన దరఖాస్తులను కార్యాలయంలో అందజేయాలని కోరారు. పూర్తి వివరాలకు 88850 12181, 99850 12181, 77308 14646 నంబర్లలో సంప్రదించాలన్నారు. సమావేశంలో ఇన్‌స్పైర్ కన్వీనర్ జిలాన్ బాషా, కో కన్వీనర్ రాము, కేఏటీడబ్ల్యూఏ టీచర్ యూనియన్ జిల్లా కార్యదర్శి మహేష్, లెక్చరర్ చంద్రశేఖర్, ఏపీవైఎఫ్ గోపాలరెడ్డి, ఏపీఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు గురు సాయి, శివ, నదీమ్, దీక్షిత్, తదితరులు పాల్గొన్నారు.
అశ్వ వాహనంపై శ్రీవారు
ఉరవకొండ రూరల్: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పెన్నహోబిలం లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం దేవేరులతో కలిసి అశ్వ వాహనంపై భక్తులకు శ్రీవారు దర్శనమిచ్చారు. ఉదయం మూలవిరాట్‌కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు పెద్ద ఎత్తున సాగాయి. సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవ మూర్తులను అశ్వ వాహనంపై కొలువు దీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. కార్యక్రమానికి ఉరవకొండకు చెందిన అంగదాల నారాయణస్వామి, అంగదాల ఆంజనేయులు, అంగదాల అభినయ్, గాజుల నాగరాజు ఉభయదాతలుగా వ్యవహరించారు.


