శింగనమల: రాష్ట్రంలో రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం గాలికి వదిలేసిందని మాజీ మంత్రి, శింగనమల నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజానాథ్ విమర్శించారు. వరి, మొక్కజొన్న కొనుగోలుకు కేంద్రాలను ఏర్పాటు చేయకపోవడమే ఇందుకు నిదర్శనమని ధ్వజమెత్తారు. శింగనమల మండలం కల్లుమడి గ్రామంలో గురువారం ఆయన పర్యటించారు. వరి, మొక్కజొన్న పంటలను పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. పంటను కొనుగోలు చేసేవారు లేక ధాన్యాన్ని పొలాల్లోనే పెట్టుకున్నామని, మొక్కజొన్న పంటను కోత కూడా కోయకుండా వదిలేశామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి అభివృద్ధి పేరుతో ప్రజాధనం దోపిడీ
సాకే శశైలజానాథ్ మాట్లాడుతూ.. అమరావతి అభివృద్ధి పేరుతో సీఎం చంద్రబాబు రూ.వేల కోట్ల ప్రజాధనాన్ని వృథాగా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. రైతులు, ప్రజలు ఎన్ని కష్టాలు పడుతున్నా ఏ మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు పండించిన వరి, మొక్కజొన్న పంటలకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్నారు. దీంతో చాలా ప్రాంతాల్లో మొక్కజొన్నను కోత కూడా కోయకుండా రైతులు వదిలేస్తున్నారన్నారు. తక్షణమే ధరల స్థిరీకరణ నిధులు కేటాయించడంతో పాటు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి అన్ని రకాల పంటల దిగుబడులను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
రైతుల సమస్యలపై 11న కలెక్టర్‌కు వినతి
నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఈ నెల 11న కలెక్టర్‌ను కలిసి విన్నవించనున్నట్లు శైలజానాథ్ తెలిపారు. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి తరిమెల వంశీ గోకుల్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పరంధామరెడ్డి, నాయకులు కొండయ్య, మధు, భాస్కర్‌రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, ఆది, కాటమయ్య, మంత్రి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.
ధరల స్థిరీకరణకు వెంటనే నిధులు కేటాయించాలి
పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలి
మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్


