కొత్త జేడీఏ రాక వాయిదా | - | Sakshi
Sakshi News home page

కొత్త జేడీఏ రాక వాయిదా

May 8 2026 11:20 AM | Updated on May 8 2026 11:20 AM

అర్ధంతరంగా వెనుదిరిగినట్లు సమాచారం

అనంతపురం అగ్రికల్చర్‌: వ్యవసాయశాఖ జాయింట్‌ డైరెక్టర్‌ (జేడీఏ)గా నియమితులైన బ్లాక్‌థిల్‌ సవ్యార్‌నంద్‌ గురువారం విధుల్లో చేరాల్సి ఉంది. అయితే ఆయన మార్గం మధ్యలో నుంచే వెనుదిరిగి వెళ్లిపోయినట్లు సమాచారం. కాగా, ఇక్కడ ఖాళీగా ఉన్న జేడీఏ స్థానానికి అల్లూరు సీతారామరాజు జిల్లాలో డీడీఏగా ఉన్న బ్లాక్‌థిల్‌కు అనంతపురం జేడీఏగా పదోన్నతి కల్పించి ఈ నెల 29న ఉత్తర్వులు ఇచ్చారు. ఆయన గురువారం విధుల్లో చేరి మరుసటి రోజున డిప్యుటేషన్‌పై తిరిగి అల్లూరు సీతారామరాజు జిల్లా జేడీఏగా వెళతారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇక్కడ ఆయన రెగ్యులర్‌గా జేడీఏగానే కొనసాగుతూ అల్లూరు జిల్లాలోనూ పనిచేస్తారని తెలిపారు. డిప్యుటేషన్‌పై వెళ్లే ముందు ఇక్కడ జేడీఏ బాధ్యతలను ఇటీవల ఏడీఏ నుంచి డీడీఏగా పదోన్నతిపై విధుల్లో చేరిన మురళీధర్‌రెడ్డికి అప్పగించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఇక్కడ ఇన్‌చార్జ్‌ జేడీఏగా ఉన్న ముదిగల్లు రవి కొత్త జేడీఏ బ్లాక్‌థిల్‌కు బాధ్యతలు ఇవ్వాలి. తర్వాత డీడీఏ మురళీధర్‌రెడ్డికి ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పజెప్పి వెళ్లాలి. రవి తన పాత స్థానం తాడిపత్రి డివిజన్‌ ఏడీఏగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే కొత్త జేడీఏ బ్లాక్‌థిల్‌ బుధవారం అల్లూరు జిల్లా నుంచి అనంతపురం బయలుదేరి విజయవాడకు చేరుకున్న తర్వాత కమిషనరేట్‌ నుంచి ఫోన్లు రావడంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగినట్లు చెబుతున్నారు. రెండు రోజులు ఆగండి... అన్నట్లు సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం తెలియని ఇరువురు ఇన్‌చార్జ్‌ జేడీఏలు ముదిగల్లు రవి, మురళీధర్‌రెడ్డి గురువారం ఉదయం నుంచి కొత్త జేడీఏ రాక కోసం ఎదురు చూస్తూ కార్యాయంలోనే ఉండిపోయారు. కాగా, మురళీధర్‌రెడ్డి ఇన్‌చార్జి జేడీఏగా బాధ్యతలు చేపట్టినా ఈ నెలాఖరున ఉద్యోగ విరమణ చేయాల్సి ఉంది. ఈ క్రమంలో ఒకట్రెండు రోజుల్లో కొత్తగా ఉత్తర్వులు వెలువడనున్నట్లు సమాచారం.

Advertisement
 
Advertisement
Advertisement