దేవుడి సొత్తు భద్రమేనా? | - | Sakshi
Sakshi News home page

దేవుడి సొత్తు భద్రమేనా?

Feb 26 2026 8:27 AM | Updated on Feb 26 2026 8:27 AM

దేవుడి సొత్తు భద్రమేనా?

దేవుడి సొత్తు భద్రమేనా?

రాయదుర్గం: ఆలయాల్లో దేవుడి సొత్తు భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. స్వాముల ఆభరణాల లెక్కలు, భద్రపరిచే విషయంలో కొందరు ఈఓలపై ఆరోపణలు వెల్లువెత్తడమే ఇందుకు కారణం. కానుకల రూపంలో తాము సమర్పించిన సొత్తు దేవునికే దక్కిందా? లేక లాకర్‌లో ఉన్నట్టు చూపి ఇతర వ్యక్తుల చేతుల్లోకి వెళ్లిందా? అనే అనుమానాలను భక్తులు వ్యక్తపరుస్తున్నారు. ఇటీవల శ్రీసత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయ ఈఓ మురళీకృష్ణ చేతివాటం ప్రదర్శించారు. భక్తులు సమర్పించిన వెండి ఆభరణాలు, చీరలు, ఇతర విలువైన వస్తువులు దోచుకుని వెళ్తుండగా భక్తులు నిలదీశారు. ఈ ఘటన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సంచలనం రేకేత్తింది. ఇలా ఏదో ఓ ఆలయంలో అక్రమాలు వెలుగుచూస్తుండడం ఆందోళన కలిగిస్తోంది.

అంజన్న ఆభరణాలపై స్పష్టతేదీ?

తాజాగా జిల్లాలోని బొమ్మనహాళ్‌ మండలంలో ప్రసిద్ధ నేమకల్లు ఆంజనేయస్వామి దేవాలయ ఆభరణాల లెక్కల విషయంలోనూ సరైన స్పష్టత లేకుండా పోయింది. రాయదుర్గం గ్రూపు దేవాలయాల ఈఓగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాసులు మూడేళ్ల క్రితం బదిలీపై వెళ్లారు. ఆ తర్వాత ఈఓగా నరసింహారెడ్డి బాధ్యతలు చేపట్టారు. బదిలీపై వెళ్లిన ఈఓ.. అంజన్న ఆభరణాలను స్వాధీనం చేయలేదు. ఉత్సవాలు, రోజూ కార్యక్రమాల్లో వినియోగించే వెండి, బంగారం ఆభరణాలు మినహా మిగిలిన సొత్తు లాకర్‌లో భద్రపరిచామంటూ చెప్పుకొచ్చారు. అయితే ఆ సొమ్ము ఎంత ఉంది? ఉంటే ఎక్కడ ఉంది? ఎవరి అధీనంలో ఉంది? అనే వివరాలు ప్రస్తుత ఈఓకు అప్పగించలేదు. దీనిపై భక్తులే కాదు గ్రామస్తులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రత్యేక కమిటీలను నియమించి ప్రతి దేవాలయంలోనూ ఆభరణాల నాణ్యత, వాటి లెక్కపై విచారణ జరిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని భక్తులు ముక్తకంఠంతో కోరుతున్నారు.

నేమకల్లు ఆలయ ఆభరణాలపై తేలని లెక్క

కొత్త ఈఓకు వివరాలు తెలపని పాత ఈఓ

ఉమ్మడి జిల్లాలో వెలుగుచూస్తున్న ఆభరణాల చోరీలు

కానుకలు సమర్పించిన భక్తుల్లో పెరుగుతున్న అనుమానాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement