పుస్తకాలతో కుస్తీ.. పస్తులతో దోస్తీ
● సాయంత్రం వరకు ప్రత్యేక తరగతులు
● స్నాక్స్ లేక నీరసిస్తున్న టెన్త్ విద్యార్థులు
రాయదుర్గంటౌన్: విద్యార్థి జీవితంలో కీలకమైన పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు వందశాతం ఉత్తీర్ణతతోపాటు ఉత్తమ ఫలితాల సాధన కోసం ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. సాయంత్రం వరకు పుస్తకాలతో కుస్తీ పడుతున్న విద్యార్థులకు స్నాక్స్ (అల్పాహారం) వంటివి లేకపోవడంతో నీరసించిపోతున్నారు. దీంతో చదువులపై ఏకాగ్రత నిలపలేని పరిస్థితి నెలకొంటోంది. ఉదయం 7.30 గంటలకే విద్యార్థులు ఇంటి నుంచి వస్తున్నారు. ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఐదున్నర గంటల వరకు ప్రత్యేక తరగతుల్లో ఉంటున్నారు. తిరిగి ఇంటికి చేరేసరికి ఆరు గంటలవుతోంది. ఇలాంటి తరుణంలో విద్యార్థులకు అల్పాహారం (స్నాక్స్) అందించేందుకు అవసరమైన నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. దీంతో జిల్లా వ్యాప్తంగా ఏ ప్రభుత్వ పాఠశాలలోనూ విద్యార్థులకు అల్పాహారం అందడం లేదు.
మధ్యాహ్న భోజనంతోనే సరి..
పదో తరతి పబ్లిక్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయం నుంచి సాయంత్రం దాకా స్టడీ అవర్స్, పరీక్షలు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు తింటున్న భోజనం తప్ప మరే ఆహారం లేకపోవడంతో సాయంకాలానికల్లా విద్యార్థులు ఆకలితో అల్లాడిపోతున్నారు. కాలే కడుపుతో చదువుపై పూర్తిస్థాయిలో ఏకాగ్రత నిలపలేక ఇబ్బంది పడుతున్నారు.
ప్రత్యేక బడ్జెట్ లేక..
ఈ ఏడాది రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ నియోజకవర్గాల్లోని 134 జెడ్పీ, ఉన్నత పాఠశాలల్లో దాదాపు పదివేల మందికిపైగా పదో తరగతి విద్యార్థులకు స్టడీ అవర్స్, ప్రత్యేక తరగతులు, పరీక్షలు నిర్వహిస్తున్నారు. వందశాత ఉత్తీర్ణతతో పాటు ఉత్తమ ఫలితాల కోసం ఉన్నతాధికారులు ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నప్పటికీ విద్యార్థులకు సాయంత్రం వేళ స్నాక్స్ ఇవ్వడానికి బడ్జెట్ లేదు. స్నాక్స్ అందించాలంటే ఒక్కో పాఠశాలకు విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1500 దాకా ఖర్చు వస్తుంది.


