చీనీలో కొత్తగా బ్రెజిలియన్ ఆరంజ్
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాలో ప్రస్తుతం సాగులో ఉన్న సాత్‌గుడి రకం చీనీకి ప్రత్యామ్నాయంగా బ్రెజిలియన్ ఆరంజ్ ఆశించిన మేర ఫలితాలు ఇస్తోందని, ఈ రకం చీనీ సాగుకు రైతులను ప్రోత్సహించాలని శాస్త్రవేత్తలకు జిల్లా ఉద్యాన అధికారి డి.ఉమాదేవి సూచించారు. జైన్ ఇరిగేషన్ కంపెనీ ఆధ్వర్యంలో ఐదేళ్ల క్రితం అనంతపురం రూరల్, నార్పల, పుట్లూరు మండలాల్లో ‘కొందరు రైతుల ద్వారా బ్రెజిలియన్ ఆరంజ్’ రకం మొక్కలు సాగు చేయించారు. ఐదేళ్లు పూర్తవడంతో తోటల స్థితిగతులు, రైతుల అనుభవాలు, పంట దిగుబడులను పరిశీలించేందుకు ఉద్యానశాఖ డీడీ డి.ఉమాదేవి, ఏడీ దేవానంద్‌కుమార్‌తో కలిసి జైన్ కంపెనీ శాస్త్రవేత్తలు డాక్టర్ లడానియా, డాక్టర్ శంకర్‌మానే, డాక్టర్ హనుమంతరెడ్డి, చేతన్‌గుల్‌వే బృందం గత రెండు రోజలుగా క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టారు. జిల్లా అంతటా 90 శాతం సాత్‌గుడి రకం చీనీ తోటలు సాగులో ఉన్నాయన్నారు. ఇటీవల కాలంలో వేరుకుళ్లు, ఎండుకుళ్లు, సిట్రస్ మొజాయిక్ వైరస్ తెగులు, పొలుసుపురుగు, నల్లమంగు లాంటి అనేక చీడపీడలు, తెగుళ్ల వల్ల దిగుబడులు తగ్గిపోతున్నట్లు తెలిపారు. దీంతో గిట్టుబాటు ధర కూడా దక్కడం లేదని గుర్తు చేశారు. బ్రెజిలియన్ ఆరంజ్ తోటలు మొదటి ఐదేళ్లు పూర్తి కావడంతో కాపునకు వచ్చి మంచి దిగుబడులు వచ్చేలా ఉన్నాయని తోటల పరిశీలన ద్వారా నిరూపితమైందన్నారు. చీడపీడలను తట్టుకునే శక్తి ఉండటం, దిగుబడుల పరంగా ఆశావహంగానే ఉన్నట్లు తెలిపారు. కాయ సైజు కాస్త చిన్నదిగా ఉన్నా.. రసం శాతం, చక్కెర శాతం (టీ అండ్ ఎస్) ఎక్కువగా ఉందని, దీంతో మార్కెట్‌లో ఈ రకం కాయకు డిమాండ్ ఉంటుందని తెలిపారు. కాయ సైజు పెంచుకునేందుకు సిఫారసు చేసిన మోతాదులో పొటాష్ ఎరువులు డ్రిప్ ద్వారా ఇవ్వడంపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. మున్ముందు ‘బ్రెజిలియన్ ఆరంజ్’ రకం సాగు విస్తీర్ణం పెంచడానికి వీలుగా, నేల రకాల ఆధారంగా ప్రయోగాత్మకంగా మరికొందరు రైతులను ప్రోత్సహించి సాగు చేయించాలని జైన్ శాస్త్రవేత్తల బృందానికి జిల్లా ఉద్యానశాఖ అధికారులు విజ్ఞప్తి చేశారు.
ప్రస్తుతం జిల్లాలో సాగులో ఉన్నదంతా ‘సాత్‌గుడి’ రకం
వేరుకుళ్లు, మొజాయిక్ లాంటి చీడపీడలతో తగ్గుతున్న దిగుబడులు
ప్రత్యామ్నాయంగా ‘బ్రెజిలియన్ ఆరంజ్’ బెస్ట్ అంటున్న శాస్త్రవేత్తలు
ఉద్యాన అధికారులతో ప్రయోగాత్మక తోటలను పరిశీలించిన ‘జైన్’


