అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి
● శాసనమండలిలో ఎమ్మెల్సీ శివరామిరెడ్డి డిమాండ్
ఉరవకొండ: ఉమ్మడి అనంతపురం జిల్లా పరిధిలోని 9 జూనియర్ కళాశాలల్లో రెగ్యూలర్ అధ్యాపకులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ వై.శివరామిరెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం ఏపీ శాసనమండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ ఫ్యాకల్టీలతోనే ప్రభుత్వ కళాశాలలు నడుస్తున్నాయన్నారు. ఒక్క రెగ్యూలర్ అధ్యాపక పోస్టును కూడా ప్రభుత్వం భర్తీ చేయలేదన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఉరవకొండ, రాయదుర్గం, ముదిగుబ్బ, గుడిబండ, తాడిమర్రి, మడకశిర, ముదిరెడ్డిపల్లి, బెళుగుప్ప, డి.హీరేహల్ కళాశాలల్లో గెస్ట్ లెక్చర్లలతోనే కాలేజీలు నడుస్తున్నాయన్నారు. మౌలిక వసతులు, రెగ్యూలర్ అధ్యాపకులు లేని కారణంగా 3 కళాశాలలను మూసి వేశారన్నారు. దీనిపై విద్యాశాఖ మంత్రి నారాలోకేష్ సమాధానమిస్తూ రెగ్యులర్ అధ్యాపకుల నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేస్తామని, కొనకొండ్లలోని బీసీ గురుకుల పాఠశాలలో ఇంటర్మీడియట్‌ను ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
వైభవంగా అడ్డపల్లకీ ఉత్సవం
ఉరవకొండ: స్థానిక గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మఠం పీఠాధిపతి జగద్గురు చెన్నబసవ రాజేంద్రస్వామి అడ్డపల్లకీ ఉత్సవం మంగళవారం వైభవంగా జరిగింది. బూదగవిలోని విడిది మంటపానికి పీఠాధిపతి చేరుకోగా, అక్కడి నుంచి వెలిగొండ రస్తాలోని మంటపం వద్దకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అక్కడ మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవ రాజేంద్రస్వామి అధ్వర్యంలో మఠం సహాయ కమిషనర్ గంజిమల్లికార్జున ప్రసాద్ పాదపూజ చేశారు. మైసూరు సంస్థానం అందజేసిన బంగారు గండ పెండేరాన్ని ధరింపజేశారు. అనంతరం విశేష పుష్పాలతో అలంకరించిన పల్లకీపై పీఠాధిపతిని పట్టణ పురవీధుల్లో ఊగించారు. కేరళ, తమిళనాడు తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో గవిమఠం సిబ్బంది నారాయణస్వామి, గోపి, మధు, తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న పోటీలు
గవిమఠం చంద్రమౌళీశ్వరస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, ముగ్గుల పోటీలు ఆకట్టుకున్నాయి. పోటీలను మఠం ఉత్తరాధికారి డాక్టర్ కరిబసవరాజేంద్రస్వామి, ఏసీ మల్లికార్జున ప్రసాద్ ప్రారంభించారు. నిస్వార్థ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు వెంకట్ గురూజీ పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల్లో విజేతలకు బ్రహ్మరథోత్సవం రోజున బహుమతులను అందజేయనున్నారు. న్యాయనిర్ణేతలుగా శ్రీనివాసరావు, శ్రీదేవి, చౌడప్ప, శంకరయ్య, నిర్మల, శైలజ, పద్మావతి, మౌనిక, రాధ, నీలిమ తదితరులు వ్యవహరించారు.
అధ్యాపక పోస్టులు భర్తీ చేయాలి


