కౌలు రైతులను మోసగిస్తున్న ప్రభుత్వం
● హామీలు నెరవేర్చకపోవడం సిగ్గుచేటు
● దీక్షలో మాజీ ఎమ్మెల్సీ గేయానంద్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నల్లప్ప
అనంతపురం అర్బన్: ‘కౌలు రైతులను చంద్రబాబు ప్రభుత్వం మోసం చేస్తోందని, అన్ని విధాల ఆదుకుంటామని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీపై నేడు డీసీఎం పవన్ కళ్యాణ్ సైతం నోరు మెదపకపోవడం సిగ్గుచేటని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్, కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు ఓ.నల్లప్ప ధ్వజమెత్తారు. కలెక్టరేట్ ఎదుట కౌలు రైతులు చేపట్టిన 30 గంటల దీక్షకు మంగళవారం వారు సంఘీభావం ప్రకటించి మాట్లాడారు. రైతుల పక్షాన పవన్ కళ్యాణ్ మాట్లాడకపోడం ఆయన అవకాశావాదానికి నిదర్శనమన్నారు. ఎకరాకు రూ.20 వేల నుంచి రూ.50వేలు కౌలు చెల్లిస్తూ పంట రుణాలు అందక ప్రైవేటుగా రూ. లక్షల్లో అప్పులు చేస్తున్నారని తెలిపారు. పంట నష్టపోయినా, గిట్టుబాటు ధర లభించక పోయినా తీవ్రంగా నష్టపోయేది కౌలు రైతులేనని అన్నారు. కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ కింద రూ.20వేలు పెట్టుబడి సాయం అందజేయాలని, రూ.2 లక్షల వరకు పంట రుణాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సి.విష్ణుచరణ్‌ను కలసి వినతిపత్రం అందజేశారు. కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, రంగారెడ్డి, వెంకటేషులు, రామాంజనేయులు, శీనప్ప, ఎర్రమ్మ, లక్ష్మన్న, ఎర్రిస్వామి, తిప్పమ్మ, నరసింహులు దీక్ష చేపట్టారు. పలు సంఘాల నాయకులు హాజరై సంఘీభావం ప్రకటించారు.


