సీమ నీటికోసం మరో ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

సీమ నీటికోసం మరో ఉద్యమం

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

సీమ నీటికోసం మరో ఉద్యమం

సీమ నీటికోసం మరో ఉద్యమం

విద్యార్థి, యువత ముందుకు రావాలి

మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ పిలుపు

అనంతపురం: రాయలసీమకు హక్కుగా దక్కాల్సిన నీటి కోసం మరో ఉద్యమం తప్పదని మాజీ మంత్రి డాక్టర్‌ సాకే శైలజానాథ్‌ అన్నారు. మేల్కోకుంటే మరో 15 ఏళ్లలో తాగేందుకు గుక్కెడు నీరు కూడా దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువత ముందుకొచ్చి నీటి హక్కు సాధించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మేరకు శుక్రవారం శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ)లో విద్యార్థులతో సమావేశమై నీటి సమస్యపై చర్చించి, ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతినబూనారు. రాయలసీమకు దక్కాల్సిన జలాల విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శైలజానాథ్‌ మాట్లాడుతూ తమ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే విషయంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక ప్రభుత్వాలు ముందుచూపుతో వ్యవహరిస్తుంటే ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని విమర్శించారు. కర్ణాటకలో గతంలో ఆల్మట్టి డ్యాం ఎత్తు 506.84 మీటర్ల నుంచి 519.24 మీటర్ల ఎత్తుకు పెంచారని, తాజాగా డ్యాం ఎత్తును 524 మీటర్లకు పెంచుతున్నా పట్టనట్టుగా వ్యవహరిస్తుండటం విచారకరమన్నారు. గతంలో 124 టీఎంసీల నిల్వ సామర్థం ఉంటే ఇప్పుడు 240 టీఎంసీల సామర్థ్యానికి పెంచుతున్నారన్నారు. దీనివల్ల మన రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. రాయలసీమలోని గాలేరు నగరి, తెలుగు గంగ, వెలిగొండ, హంద్రీ–నీవా అన్నీ శ్రీశైలం ప్రాజెక్ట్‌పైనే ఆధారపడి ఉన్నాయన్నారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ సామర్థ్యాన్ని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచి రోజుకు 4 టీఎంసీలు తరలించేలా చేశారన్నారు. ఆ తర్వాత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి వచ్చాక 80 వేల క్యూసెక్కులకు పెంచారని కొనియాడారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ కెనాల్‌ వెలుగోడు, సోమలశిల ప్రాజెక్టులకు మంచి జరిగే ఆలోచనను వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి సంకల్పించారన్నారు. 2024లో ఎన్నికల సమయం వరకు పనులు జరిగాయన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ఆ పనులు నిలిపేశారన్నారు. ఇటీవల రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తెలంగాణ ప్రయోజనాలు కాపాడడం కోసం చంద్రబాబుతో మాట్లాడి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించానని గర్వంగా చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలను చంద్రబాబు ఖండిస్తారనుకుంటే విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. 20 టీఎంసీల కోసం రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌ అవసరమా? అని ప్రశ్నించేలా చంద్రబాబు మాట్లాడడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శ్రీశైలం ప్రాజెక్టు ద్వారా 800 అడుగుల నుంచే నీటిని తీసుకెళ్లకపోతే రాయలసీమ ఎడారిబారిన పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ క్షేమం కోరేవాళ్లు రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి చేసేలా పనులు చేయాలని అడుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి హంద్రీ–నీవా సామర్థ్యం పెంచితే.. చంద్రబాబు వచ్చాక మళ్లీ తగ్గించడం ద్రోహమే అవుతుందన్నారు. గతంలో రాయలసీమకు కేటాయించిన ఎయిమ్స్‌ను మంగళగిరికి తరలించేశారన్నారు. కర్నూలు నుంచి హైకోర్టు.. కడప నుంచి సహకార బ్యాంకు తరలించేశారని గుర్తు చేశారు. ఉక్కు పరిశ్రమకు ఊసే లేకుండా చేశారన్నారు. రాయలసీమ నీటి అవసరాలు తీర్చేలా ప్రభుత్వ విధానాలు, నిధుల కేటాయింపులు ఉండాలని, ఇందుకోసం ఉద్యమిద్దామని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బండ్లపల్లి ప్రతాప్‌రెడ్డి, విద్యార్థి విభాగం నాయకులు గెలివి జయచంద్రారెడ్డి, పి.హేమంత్‌కుమార్‌, చిగండి రమేష్‌, కై లాష్‌, ఎస్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్‌ నాయక్‌, తేజేశ్వరరెడ్డి, శివ, వీరూ యాదవ్‌, సురేష్‌, బీదర జయచంద్రారెడ్డి (న్యాయవాది), యశ్వంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement