కళ్యాణదుర్గం ఆర్‌అండ్‌బీ డివిజన్ రద్దు
కళ్యాణదుర్గం రూరల్: జిల్లాలో వెనుకబడిన ప్రాంతమైన కళ్యాణదుర్గంలో రోడ్లు, భవనాల శాఖ డివిజన్ రద్దయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసి అందరినీ షాక్‌కు గురిచేసింది. ఇక్కడ డివిజన్ రద్దు చేసి శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్నారు. శ్రీసత్యసాయి జిల్లాకు కొత్తగా డివిజన్ ఏర్పాటు చేసినట్లు గొప్పగా చెప్పుకుంటున్న ప్రభుత్వం.. కళ్యాణదుర్గం ప్రాంత వాసులకు డివిజన్ రద్దుతో అన్యాయం చేసిన విషయం గురించి చెప్పకపోవడం గమనార్హం. కళ్యాణదుర్గం నియోజవర్గం వెనుకబడిన ప్రాంతం కావడంతో 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం రహదారుల, భవనాల శాఖ డివిజన్‌ను ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి ఈ శాఖ ద్వారా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలో రోడ్ల నిర్మాణాలు జరిగాయి. డివిజన్ కార్యాలయంలో 24 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పుడు ఆ డివిజన్ రద్దుతో పాటు ఇందులో పనిచేసే ఉద్యోగులందరినీ హిందూపురానికి తరలించారు. ఇక నుంచి రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాల ప్రజలు ఆర్‌అండ్‌బీ సేవల కోసం అనంతపురం వెళ్లాల్సి ఉంటుంది. ఈ ప్రాంతానికి ఇంత అన్యాయం జరుగుతున్నా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉండటంపై ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
హిందూపురానికి ఉద్యోగుల బదిలీ
కళ్యాణదుర్గం, రాయదుర్గం ప్రాంత ప్రజలకు తప్పని ఇక్కట్లు
ప్రేక్షక పాత్ర వహిస్తున్న ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు


