భూసేకరణ వేగవంతం చేయండి
అనంతపురం అర్బన్: ప్రాజెక్టులకు భూ సేకరణ, భూ బదలాయింపు ప్రక్రియలు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. జాతీయ రహదారులు, రైల్వే, తదితర ప్రాజెక్టుల భూసేకరణపై జేసీ శుక్రవారం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న భూసేకరణ కేసులు, భూ బదలాయింపు ప్రతిపాదనల్లో పురోగతి సాధించాలని ఆదేశించారు. భూ సంబంధిత వ్యవహారాల్లో పారదర్శకంగా వ్యవహరిస్తూ సమన్వయంతో పూర్తి చేయాలని చెప్పారు. సమావేశంలో ఎన్‌హెచ్ పీడీ తరుణ్, నెడ్‌క్యాప్ అధికారి కిషోర్, భూ విభాగం సూపరింటెండెంట్ రియాజుద్ధీన్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
13 మంది ఎస్‌ఏలకు
వీఆర్‌ఓలుగా రివర్షన్
అనంతపురం అర్బన్: గ్రేడ్–1 వీఆర్‌ఓగా ఉంటూ సీనియర్ అసిస్టెంట్ (ఎస్‌ఏ)గా పదోన్నతి పొందిన 13 మంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం శాఖపర పరీక్షలు పూర్తి చేయని కారణంగా రివర్షన్ ఇచ్చారు. ఈ మేరకు కలెక్టర్ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. గ్రేడ్–1 వీఆర్‌ఓలు కండిషన్ మీద సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి పొందారు. నిబంధనల ప్రకారం నిర్ణీత గుడువులోగా రెవెన్యూ పరీక్షలు 1, 2, 3, సర్వే శిక్షణ (42 రోజులు), క్రాప్ శాంపలింగ్, అకౌంట్స్ పరీక్ష పూర్తి చేయాల్సి ఉంది. అయితే వాటిని పూర్తి చేయని కారణంగా ఎస్‌ఏ పదోన్నతి రద్దు చేసి తిరిగి వీఆర్‌ఓ గ్రేడ్–1గా రివర్షన్ ఇచ్చారు.
రివర్షన్ పొందింది వీరే...
శ్రీసత్యసాయి జిల్లాలో బి.ఒన్నూరప్ప, కె.శ్రీనివాసులు, హెచ్.ఎస్.రామకృష్ణ, కె.ఉమా మంజూనాథ్‌రావు, సి.జయప్రకాష్, కె.హరిప్రసాద్, వి.సత్యనారాయణ, వి.శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఇక అనంతపురం జిల్లాలో వై.శ్రీనివాసులు, టి.వెంకటేసులు, జె.లక్ష్మిదేవి, ఎన్.రామూర్తి, పి.గోవిందరెడ్డి ఉన్నారు.
హంద్రీ–నీవా సీఈగా కబీర్‌బాషా
అనంతపురం సెంట్రల్: హంద్రీ–నీవా సీఈగా కర్నూలు సీఈ కబీర్‌బాషాకు అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి సాయిప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. గత నెల 30తో సీఈ నాగరాజ ఉద్యోగ విరమణ చేసిన విషయం విదితమే. అయితే తన పదవీకాలాన్ని పొడిగించాలని ప్రభుత్వానికి ఆయన దరఖాస్తు చేసుకున్నారు. అక్కడి నుంచి నిర్ణయం వెలువడటానికి ఆలస్యమవుతుండటంతో.. పరిపాలనా సౌలభ్యం కోసం తాత్కాలికంగా కర్నూలు సీఈకి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు అధికారవర్గాలు వెల్లడించాయి.
వసూలు చేసిన డబ్బు వెనక్కు
అనంతపురం అర్బన్: కలెక్టరేట్‌లో అవినీతికి పాల్పడిన ఉద్యోగి.. బాధితులకు డబ్బు వెనక్కు ఇచ్చేశాడు. ఒక అధికారి వద్ద సీసీగా ఉన్న వ్యక్తి భూముల ఫైళ్లు క్లియరెన్స్ చేయిస్తానని పలువురి వద్ద డబ్బులు వసూలు చేశాడు. దీనిపై ‘కలెక్టరేట్‌లో అవినీతి అనకొండ’ శీర్షికన ‘సాక్షి’లో ఈ నెల ఐదో తేదీన ప్రచురితమైన కథనం చర్చనీయాంశమైంది. సీసీపై సదరు అధికారి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. దీంతో ఆయన బాధితుల్లో ఒకరైన మదనపల్లికి చెందిన సీఎం సమీప బంధువుకు రూ.2 లక్షలు, యాడికి మండలం కంబాలపాడుకు చెందిన వ్యక్తికి రూ.30 వేలు వెనక్కు ఇచ్చేసినట్లు సమాచారం. అదే క్రమంలో బెంగళూరుకు చెందిన పార్టీతో డబ్బు విషయమై మాట్లాడుకున్నట్లు తెలిసింది.
సోలార్ సమస్యలా.. 1912కు తెలపండి
అనంతపురం టౌన్: సోలార్ విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు టోల్ ఫ్రీ నంబర్ 1912ను సంప్రదించాలని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో సూచించారు. కాల్ సెంటర్‌లో సోలార్ విద్యుత్ సమస్యలను సైతం ఫిర్యాదు చేసే స్కౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ఫిర్యాదులను నిర్దిష్ట గడువులోపు పరిష్కరించనున్నట్లు పేర్కొన్నారు.
భూసేకరణ వేగవంతం చేయండి


