లంచం ఇవ్వలేదని దాడికి యత్నం | - | Sakshi
Sakshi News home page

లంచం ఇవ్వలేదని దాడికి యత్నం

Feb 21 2026 7:11 AM | Updated on Feb 21 2026 7:11 AM

లంచం ఇవ్వలేదని  దాడికి యత్నం

లంచం ఇవ్వలేదని దాడికి యత్నం

అనంతపురం సచివాలయం–3 అడ్మిన్‌ తీరుపై బాధితుల ఫిర్యాదు

అనంతపురం క్రైం: అడిగినంత లంచం ఇవ్వలేదన్న అక్కసుతో అనంతపురం నగర పాలక సంస్థ పరిధిలోని సచివాలయం– 3 అడ్మిన్‌ చెలరేగిపోయాడు. ఈ అంశం నగర పాలక సంస్థ రెవెన్యూ విభాగంలో హాట్‌టాపిక్‌గా మారింది. బాధితులు తెలిపిన మేరకు... స్థానిక వినాయకనగర్‌లోని 3వ సచివాలయం పరిధిలో డోరు నంబరు 19–1–37 ఇంటిని చిత్రచేడు రాఘవ కొనుగోలు చేశారు. గుత్తలు తన పేరు మీద మార్పించే పనిని తన వద్ద గుమస్తాగా పని చేస్తున్న సే ఎర్రిస్వామికి అప్పగించారు. దీంతో ఆయన నేరుగా సంబంధిత సచివాలయ అడ్మిన్‌ రవికుమార్‌ను కలసి సంప్రదించడంతో పని పూర్తి చేయడానికి తనకు రూ.50 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. ఇదే విషయాన్ని తన యజమాని దృష్టికి ఎర్రిస్వామి తీసుకెళ్లి రూ.20 వేలు చెల్లించి పని పూర్తి చేయించాడు. ఆ తర్వాత మిగిలిన రూ.30 వేలు ఇవ్వలేదంటూ ఎర్రిస్వామి ద్విచక్ర వాహనాన్ని లాక్కొని దాడికి ప్రయత్నించడంతో బాధితులు నేరుగా శుక్రవారం ఇన్‌చార్జ్‌ కమిషనర్‌ రాజశేఖర్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును అధికారులు సీరియస్‌గా పరిగణించారు. కాగా, తాను తీసుకుంటున్న ప్రతి లంచంలోనూ కమిషనర్‌ స్థాయి అధికారికి సైతం వాటా చెల్లించాల్సి ఉంటుందని రవి తెలిపినట్లు బాధితులు తమ ఫిర్యాదులో పేర్కొనడం గమనార్హం.

పది మంది విద్యార్థులు డీబార్‌

అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డిగ్రీ మొదటి సెమిస్టర్‌ పరీక్షల్లో మాస్‌కాపీయింగ్‌కు పాల్పడుతూ పట్టుబడిన పది మంది విద్యార్థులను డీబార్‌ చేసినట్లు డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యుయేషన్స్‌ ప్రొఫెసర్‌ జీవీ రమణ తెలిపారు. హిందూపురం బాలయేసు డిగ్రీ కళాశాలలో ఒకరు, బాలాజీ విద్యా మందిర్‌లో ముగ్గురు, కళ్యాణదుర్గం జ్యోతిర్మయి మహిళా డిగ్రీ కళాశాలలో ఐదుగురు, అనంతపురం నగరం శ్రీచైతన్య డిగ్రీ కళాశాలలో ఒకరిపై చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement