మరీ ఇంత చిన్నకోడిగుడ్లా..?
అనంతపురం సిటీ: మధ్యాహ్న భోజన పథకం కింద ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందిస్తున్న కోడిగుడ్లు పరిమాణం తగ్గి ఉండటాన్ని డీఈఓ ప్రసాద్‌బాబు గుర్తించారు. ‘డొక్క’లు ఎండబెట్టి.. నిధులు కొల్లగొట్టి’, ‘కోడిగుడ్ల కుంభకోణంపై సమగ్ర విచారణ’ శీర్షికలతో ‘సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలకు డీఈఓ స్పందించారు. బుధవారం క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లారు. శింగనమల మండలం ఆకులేడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోడిగుడ్లు, చిక్కీలను పరిశీలించారు. నిర్దేశించిన పరిమాణం కన్నా కోడిగుడ్లు చిన్నవిగా ఉండడాన్ని గమనించారు. వీటిని అప్పుడే ఎందుకు తిరస్కరించలేదంటూ హెచ్‌ఎంను ప్రశ్నించినట్లు తెలిసింది. మెనూ ప్రకారం భోజనం పెడుతున్నారా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం హెచ్‌ఎం, ఉపాధ్యాయులతో ఆయన సమావేశమయ్యారు. నిబంధనల మేరకు సరుకులు సరఫరా లేకపోతే ఫిర్యాదు చేయాలని ఆదేశించారు. గార్లదిన్నె మండలం లోలూరు ప్రాథమిక పాఠశాలలోనూ కోడిగుడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది.
మరీ ఇంత చిన్నకోడిగుడ్లా..?


