ఉరవకొండ టౌన్ బ్యాంకు డిపాజిట్‌దారులకు శుభవార్త
ఉరవకొండ: లిక్విడేటర్ ఉరవకొండ కోఆపరేటివ్ టౌన్ బ్యాంకు డిపాజిట్‌దారులకు రెండో విడత నగదు చెల్లింపునకు చర్యలు తీసుకుంటున్నట్లు కో–పరేటివ్ బ్యాంకు జిల్లా అధికారి అరుణకుమారి తెలిపారు. బుధవారం స్థానిక గాంధీచౌక్ వద్ద ఉన్న టౌన్‌బ్యాంకు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. టౌన్ బ్యాంకు పరిధిలో 4,811 మంది డిపాజిటర్లు ఉన్నారని వీరికి రూ 5,92,58,828 నగదు చెల్లించాల్సి ఉందన్నారు. తొలివిడతగా 1,110 మందికి రూ.4.20 కోట్ల డిపాజిట్లను చెల్లించినట్లు వివరించారు. ప్రస్తుతం రెండో విడతగా మిగిలిన 3,711 డిపాజిట్‌దారులకు రూ.1,72,27,983 చెల్లించేందుకు చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. డిపాజిట్ దారులు ఒరిజినల్ ఎఫ్‌డీ బాండ్లు, ఆధార్, పాస్ జిరాక్స్‌తో పాటు డిపాజిట్‌దారుడి ఇతర బ్యాంకులకు సంబందించిన ఖాతా నంబర్, ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ వివరాలను వెంటనే ఉరవకొండ కోఆపరేటివ్ బ్యాంక్‌లో అందజేయాలన్నారు. ఇంకా 3,665 మంది డిపాజిట్‌దారులు ఈకేవైసీ చేయించుకోలేదని, దీంతో వీరికి నగదు చెల్లింపుల్లో జాప్యం చోటు చేసుకుంటోందన్నారు.
ఉత్కంఠగా ఫుట్‌బాల్ పోటీలు
అనంతపురం కార్పొరేషన్: ఇన్‌స్పైర్ ఫుట్‌బాల్ పోటీలు అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో ఉత్కంఠగా సాగుతున్నాయి. బుధవారం జరిగిన మ్యాచ్‌లో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టు 1–0 గోల్స్ తేడాతో ఫజల్ ఎఫ్‌సీ జట్టుపై గెలుపొందింది. నర్మదావ్యాలీ ఎఫ్‌సీ జట్టు 9–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై, టర్న్ ప్రో జట్టు 5–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై, ఫాల్కోన్ గర్‌ల్స్ 12–0 గోల్స్ తేడాతో నాందీ ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ జట్టు 6–0 గోల్స్ తేడాతో కెంప్ ఎఫ్‌సీ జట్టుపై గెలుపొందాయి. బెంగళూరు ఎఫ్‌సీ, పుదువయ్ యూనికార్న్ జట్ల మధ్య మ్యాచ్ డ్రాగా ముగిసింది.
వ్యక్తి దుర్మరణం
గుత్తి రూరల్: లారీ ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు.. గుంతకల్లు మండలం నాగసముద్రం గ్రామానికి చెందిన ముని (40), సూరి బుధవారం మొలకలపెంట గ్రామంలో జరిగిన ఊరు జాతరలో పాల్గొని అనంతరం ద్విచక్ర వాహనంపై తిరుగు ప్రయాణమయ్యారు. రజాపురం శివారులోకి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా దూసుకొచ్చిన లారీ ఢీకొంది. ముని అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన సూరిని స్థానికులు వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఉరవకొండ టౌన్ బ్యాంకు డిపాజిట్‌దారులకు శుభవార్త


