తప్పుడు కేసులు ఎత్తేయకపోతే ఆందోళనలు ఉధృతం
●విద్యార్థి సంఘాల నేతల హెచ్చరిక
అనంతపురం సిటీ: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ విశాఖపట్నంలో ఉద్యమించిన విద్యార్థి సంఘాల నాయకులపై తప్పుడు కేసులు బనాయించి, రౌడీషీట్ ఓపెన్ చేయడం దుర్మార్గమని, తక్షణమే తప్పుడు కేసులను ఎత్తేయకపోతే ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని చంద్రబాబు సర్కార్‌ను విద్యార్థి సంఘాల నేతలు హెచ్చరించారు. అనంతపురంలోని సీపీఐ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌యాదవ్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కుళ్లాయిస్వామి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు కోట్రేష్, ఎన్‌ఎస్‌యూవై రాష్ట్ర సమన్వయకర్త నరేష్, ఏఐఎస్‌బీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరేంద్రప్రసాద్, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య రాష్ట్ర కార్యద్శి సురేష్‌యాదవ్ మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజావ్యతిరేక పాలన సాగుతోందన్నారు. నారా లోకేష్ రాసుకున్న రెడ్‌బుక్ రాజ్యాంగం నడుస్తోందన్నారు. సీఎం చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్ నియంతృత్వ ధోరణి వీడకపోతే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి ఉంటుందని హెచ్చరించారు.
రాప్తాడులో చోరీ
రాప్తాడు రూరల్: మండల కేంద్రం రాప్తాడులో మంగళవారం రాత్రి ఓ ఇంట్లో దుండగులు చొరబడి బంగారు నగలు అపహరించారు. పోలీసులు తెలిపిన మేరకు... రాప్తాడులోని బ్రహ్మంగారి గుడి సమీపంలో నివాసముంటున్న బుల్లే ఉజ్జినప్ప, ఆదిలక్ష్మి దంపతులు, కుమారుడు ప్రకాష్‌తో కలిసి మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి తోటకు వెళ్లారు. రాత్రి 9.30 గంటలకు తల్లి, కుమారుడు ఇంటికి వచ్చారు. వెనుకవైపు కిటికి కడ్డీలు తొలిగించి ఉండడంతో అనుమానంగా వాకిలి తీశారు. అప్పటికే తీసి ఉన్న బీరువా తలుపులను గమనించి పరిశీలించారు. బంగారు నగలు కనిపించకపోడంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం ఉదయం సీఐ శ్రీహర్ష ఘటనాస్థలాన్ని పరిశీలించారు. క్లూస్‌టీంను పిలిపించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


