టీడీపీ వర్గీయుల బాహాబాహీ
గుత్తి: స్థల వివాదంలో టీడీపీకి చెందిన రెండు వర్గాల మధ్య గొడవ చోటు చేసుకుని విధ్వంసానికి దారి తీసింది. బుధవారం ఉదయం గుత్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన మేరకు.. గుత్తిలోని లచ్చానుపల్లి మార్గంలో నివాసముంటున్న టీడీపీ నేతగా చెలామణి అవుతున్న జీఆర్పీ కానిస్టేబుల్ వాసు, గుత్తిలో దుకాణం ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న కొంగనపల్లికి చెందిన టీడీపీ కార్యకర్త గోవర్దన్ మధ్య కొంత కాలంగా స్థల వివాదం నడుస్తోంది. గుత్తి – అనంతపురం మార్గంలో ఉన్న సదరు స్థలాన్ని తాను కొనుగోలు చేశానంటూ వాసు హద్దులు ఏర్పాటు చేసుకుని చుట్టూ గోడ నిర్మించాడు. అయితే ఆ స్థలం తనదిగా గోవర్దన్ పేర్కొంటూ వాసు చర్యలను ఆక్షేపిస్తూ వచ్చాడు. ఈ క్రమంలో స్థలంలో ఏర్పాటు చేసిన హద్దులను, గోడను ఓ వర్గం ధ్వంసం చేసింది. దీంతో వారిపై వాసు దాడికి ప్రయత్నించాడు. ఘటనపై పోలీసులకు గోవర్దన్ ఫిర్యాదు చేశాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం దాదాపు 40 మంది వాసు ఇంటిపై రాళ్లు రువ్వి విధ్వంసానికి పాల్పడ్డారు. అక్కడ ఉన్న స్కార్పియో వాహనాన్ని ధ్వంసం చేశారు. అడ్డుకోబోయిన వాసుపై కూడా దాడి చేయడంతో క్షతగాత్రుడు ఆస్పత్రిలో చేరాడు. వాసు ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా, వివాదానికి కారణమైన స్థలం ప్రభుత్వ పొరంబోకుగా రెవెన్యూ రికార్డుల్లో ఉందని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆ స్థలాన్ని కబ్జా చేసేందుకు టీడీపీ వర్గీయులు చేస్తున్న ప్రయత్నాలు సిగ్గు చేటని స్థానికులు మండిపడ్డారు.



