మామిడి పూతను నిలుపుకోవాలి
అనంతపురం అగ్రికల్చర్: కనిష్ట ఉష్ణోగ్రతలతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు నెలకొన్నందున పూత నిలబెట్టుకుంటే మామిడిలో మంచి దిగుబడులు సాధించే అవకాశం ఉందని రైతులకు ఉభయ జిల్లాల ఉద్యాన అధికారులు డి.ఉమాదేవి, జి.చంద్రశేఖర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. అనంతపురం జిల్లాలో 15 వేల హెక్టార్లు, శ్రీసత్యసాయి జిల్లా పరిధిలో 20 వేల హెక్టార్లలో విస్తరించిన మామిడి తోటల పరిస్థితి ప్రస్తుతానికి ఆశాజనకంగానే ఉన్నాయన్నారు. అయితే మరీ శీతల వాతావరణ పరిస్థితులు ఉన్నందున కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొవాల్సి వస్తోందన్నారు. కీలకదశలో మంచు తీవ్రత కారణంగా పూత, పిందెకు నష్టంతో పాటు చీడపీడల వ్యాప్తి కూడా ఉండవచ్చన్నారు. ప్రస్తుతం పచ్చిపూత దశలో ఉన్న తోటల్లో అల్టర్నేరియా శిలీంధ్రం వల్ల పూత నల్లబారిపోతుందని, నివారణకు లీటర్ నీటికి 1 గ్రాము కార్బండిజమ్ + 2.5 గ్రాముల ఎం–45 కలిపి పిచికారీ చేయాలన్నారు. ఇంకా పూత కనిపించని తోటల్లో లీటర్ నీటికి 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ + 1.5 గ్రాముల సల్ఫర్ కలిపి పిచికారీ చేయాలన్నారు. వారం లేదా పది రోజుల తర్వాత లీటర్ నీటికి 1.2 మి.లీ బూప్రోఫిజిన్ + 2 మి.లీ హెక్సాకొనజోల్ కలిపి పిచికారీ చేయాలన్నారు. దీని వల్ల బూడిద తెగులు, ఇతర రసం పీల్చు పురుగుల నియంత్రణ సాధ్యమవుతుందన్నారు. ప్రస్తుతానికి నీటి తడులు పెద్దగా అవసరం లేదన్నారు. పిందె తర్వాత ఉష్ణ్రోగతలు పెరిగితే నీటి యాజమాన్యంపై దృష్టి సారించాల్సి ఉంటుందన్నారు.
ఉద్యానశాఖ అధికారులు ఉమాదేవి, చంద్రశేఖర్


