ప్రజల విశ్వాసాలతో ఆటలాడొద్దు
● మైసూరు నరిగమ్మ ఆలయ తొలగింపు ఆపేయాలి
● రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి డిమాండ్
రాప్తాడురూరల్: దేవాలయాలకు సంబంధించి ప్రజల విశ్వాసాలతో ఆటలాడరాదని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం రూరల్ మండలం పాపంపేట శివారు కళ్యాణదుర్గం ప్రధాన రోడ్డులో వెలసిన మైసూరు నరిగమ్మ ఆలయ తొలగింపుపై చంద్రబాబు ప్రభుత్వం చర్యలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. మంగళవారం ప్రకాష్‌రెడ్డిని ఆ ప్రాంతవాసులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సనాతన ధర్మ పరిరక్షకుడినని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గొంతు ఈ విషయంలో మూగబోయిందా? అని నిలదీశారు. స్థానిక ఎమ్మెల్యే పరిటాల సునీత నిద్రపోతున్నారా? అని మండిపడ్డారు. నరిగమ్మ ఆలయం భక్తుల ఆరాధనకు కేంద్రంగా నిలిచిందన్నారు. అయితే ఈ ఆలయ తొలగింపునకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుందన్నారు. గతంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఆలయం తొలగింపునకు జరిగిన ప్రయత్నాలకు స్పష్టమైన బ్రేక్ పడిందని గుర్తు చేశారు. భక్తుల విశ్వాసాలు, ప్రజాభిప్రాయాల్ని గౌరవిస్తూ ఆలయ పరిరక్షణకు అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ ఆలయం తొలగింపునకు శ్రీకారం చుట్టారన్నారు. నరిగమ్మ ఆలయం కేవలం ఒక కట్టడం కాదని.. వేలాదిమంది భక్తుల విశ్వాసానికి ప్రతీక అని అభివర్ణించారు. ఇది సంప్రదాయం, సంస్కృతి, ఆధ్యాత్మిక విలువలకు కేంద్రబిందువని అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆలయాలపై చర్యలు తీసుకోవడం ప్రజాస్వామ్య విలువలకు పూర్తిగా విరుద్ధమన్నారు. ఇప్పటికై నా ఆలయం తొలగింపునకు సంబంధించిన అన్ని చర్యలనూ తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేశారు. భక్తులు, గ్రామ ప్రజలు, స్థానిక సంఘాలతో సంపూర్ణ సంప్రదింపులు జరపాలన్నారు. ఆలయ పరిరక్షణకు సంబంధించి ప్రభుత్వం స్పష్టమైన హామీ ప్రకటించాలన్నారు.


