ప్రచార ఆర్భాటం.. రైతుకు శాపం
ఆత్మకూరు: టీడీపీ ప్రజాప్రతినిధుల ప్రచార ఆర్భాటం అన్నదాతలకు శాపంగా పరిణమించింది. ఇందుకు నిదర్శనమే ఆత్మకూరు మండలం గొరిదిండ్ల సబ్‌స్టేషన్ ప్రారంభం. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చొరవతో శంకుస్థాపన చేసుకున్న ఈ సబ్ స్టేషన్‌ను నాలుగు నెలల క్రితం ప్రస్తుత ఎమ్మెల్యే పరిటాల సునీత ప్రారంభించారు. ఇక్కడి వరకూ అంతాబాగానే ఉన్నా... సబ్ స్టేషన్ నుంచి నేటికీ విద్యుత్ సరఫరా కాకపోవడంతో పొరుగున ఉన్న మరో సబ్ స్టేషన్ నుంచి వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా చేస్తున్నారు. అదనపు లోడు కారణంగా లో ఓల్టేజీ సమస్య తలెత్తి ఎక్కడికక్కడ వ్యవసాయ బోరు బావుల మోటార్లు కాలిపోతున్నాయి. ప్రచార ఆర్భాటంతో గొరిదిండ్ల సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి తమను ఇక్కట్లు పాలు చేశారంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఒక్క రోజులోనే భారీ నష్టం
గొరిదిండ్ల గ్రామం వద్ద నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్ ద్వారా గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా, ముట్టాల, పాపంపల్లి గ్రామాల పరిధిలోని వ్యవసాయ కనెక్షన్లకు విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. ఈ నాలుగు గ్రామాల రైతులకు సంబంధించి దాదాపు 1,500 వరకు విద్యుత్ మోటార్లు ఉన్నాయి. వీటికి ఆత్మకూరు విద్యుత్ సబ్ స్టేషన్ నుంచి విద్యుత్‌ను అధికారులు సరఫరా చేస్తున్నారు. అయితే ఆత్మకూరు నుంచి గొరిదిండ్ల వరకూ దాదాపు 3 వేలకు పైగా వ్యవసాయ కనెక్షన్లు ఉండడంతో సబ్‌స్టేషన్‌పై అదనపు భారం పడి లో ఓల్టేజీ సమస్య ఉత్పన్నమవుతోంది. ఇదే విషయాన్ని ఉన్నతాధికారులకు పదుల సంఖ్యలో గొరిదిండ్ల గ్రామ రైతులు అర్జీలు ఇచ్చి, సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. అయినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. లో ఓల్టేజ్ కారణంగా ప్రతి రెండు నెలలకు ఒకసారి బోరు మోటార్లు కాలిపోతున్నాయి. ఒక్కసారి మోటారు కాలిపోతే దానిని మరమ్మతు చేయించుకునేందుకు రైతులు రూ.7 వేలకు పైగా ఖర్చు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఈ నెల 5న (సోమవారం) రాత్రి నుంచి మంగళవారం తెల్లవారేలోపు లో ఓల్టేజీ కారణంగా గొరిదిండ్ల, గొరిదిండ్ల తండా గ్రామాల రైతులకు చెందిన 70 మోటర్లు కాలిపోయాయి. కేవలం ఆరు గంటల వ్యవధిలోనే రూ.4.90 లక్షల నష్టాన్ని రైతులు మూట గట్టుకోవాల్సి వచ్చింది. నాలుగు నెలల క్రితం ప్రచార ఆర్భాటాలకు పోయి విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత... ఆ తర్వాత సదరు సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అవుతోందా? లేదా? అనే విషయంలో నిర్లక్ష్యం వహించారని, ఫలితంగా తాము ఆర్థికంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు మండిపడుతున్నారు.
సిబ్బంది లేరు
గొరిదిండ్లలో నూతనంగా నిర్మించిన సబ్‌స్టేషన్‌ను ప్రారంభించి నాలుగు నెలలైన మాట వాస్తవమే. అయితే సిబ్బంది కొరత కారణంగా సబ్‌స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా కావడం లేదు. ఆత్మకూరు నుంచి గొరిదిండ్ల తండా గ్రామానికి దూరం ఎక్కువ అయినందున లో ఓల్టేజ్ సమస్య తలెత్తుతోంది. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకుంటాం.
– దాస్, ఏఈ, విద్యుత్ శాఖ
నాలుగు నెలల క్రితం గొరిదిండ్ల సబ్‌స్టేషన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే పరిటాల సునీత
సాంకేతిక కారణాలతో సబ్‌స్టేషన్ నుంచి నేటికీ సరఫరా కాని విద్యుత్
మరో సబ్‌స్టేషన్‌పై అదనపు భారం
లో ఓల్టేజీ కారణంగా ఒకే రోజు కాలిపోయిన 70కు పైగా వ్యవసాయ మోటార్లు
మరమ్మతు చేసిన మోటారును బోరుబావిలోకి దింపుతున్న ఈ రైతు పేరు బాపు జయప్ప. గొరిదిండ్ల గ్రామం. ముగ్గురు అన్నదమ్ములకు కలిపి 12 ఎకరాల వరకూ పొలం ఉంది. గత రాత్రి విద్యుత్ లో ఓల్టేజీ సమస్య కారణంగా మూడు మోటార్లు కాలిపోయాయి. దీంతో పంటను కాపాడుకునేందుకు ఆగమేఘాలపై మోటార్లును మరమ్మతు చేయించి మంగళవారం సాయంత్రానికి బోరు బావుల్లో ఏర్పాటు చేయించారు.


