వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలి
● సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ
అనంతపురం సిటీ: పదో తరగతి పరీక్షల్లో వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని కేజీబీవీ సిబ్బందిని సమగ్ర శిక్ష ఏపీసీ శైలజ ఆదేశించారు. బుక్కరాయసముద్రంలోని కేజీబీవీలో రెండ్రోజులుగా నిర్వహించిన జిల్లా స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమం మంగళవారంతో ముగిసింది. ముగింపు కార్యక్రమానికి జీసీడీఓ కవిత అధ్యక్షత వహించగా.. శైలజ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జిల్లాలోని 32 కేజీబీవీలకు చెందిన సీఆర్‌టీలు, పీజీటీలకు నిర్వహించిన ఓరియంటేషన్ కార్యక్రమం విజయవంతం చేసినందుకు అభినందనలు తెలిపారు. ప్రతి విద్యార్థిని ప్రతి సబ్జెక్టులో మంచి మార్కులతో పాసయ్యేలా చూడాల్సిన బాధ్యత ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులదే అన్నారు. కార్యక్రమంలో సబ్జెక్టు నిపుణులు సిద్దేశ్వరప్రసాద్, సుదర్శన్‌రాజు, లక్ష్మీరంగయ్య, రామకృష్ణ, శ్రీధర్‌రెడ్డి, శివప్రసాద్, చంద్రశేఖర్, గురివిరెడ్డి, రామాంజనేయులు పాల్గొన్నారు.
‘అనంత పాలధార’ను విజయవంతం చేయండి
అనంతపురం అగ్రికల్చర్: స్థానిక రూరల్ మండలం ఆకుతోటలపల్లి గ్రామంలో ఈ నెల 7 (బుధవారం) నుంచి మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘అనంత పాలధార’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పశుసంర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.ప్రేమ్‌చంద్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక పశుశాఖ కార్యాలయంలో డీడీలు డాక్టర్ వై.రమేష్‌రెడ్డి, డాక్టర్ ఉమామహేశ్వరరెడ్డి, ఏడీ డాక్టర్ ఏవీ రత్నకుమార్‌తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రైతు పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని రాయలసీమలోనే తొలిసారిగా ‘అనంత’లో వినూత్నమైన కార్యక్రమం తలపెట్టామన్నారు. అందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. తొలిరోజు బుధవారం మూడు విభాగాల పాల దిగుబడి పోటీలు ఉంటాయన్నారు. మూడు విభాగాల్లోనూ ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు అందిస్తామన్నారు. రెండో రోజు గురువారం లేగదూడల ప్రదర్శన, వాటి అందాల పోటీలు, అలాగే గర్భకోశవ్యాధి శిబిరం ఉంటుందన్నారు. మూడో రోజు ముగింపు, బహుమతుల ప్రదానం ఉంటుందని పేర్కొన్నారు. జిల్లా నలుమూలల నుంచి మేలు జాతి పాడి ఆవులతో రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి ,కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఇది కేవలం పోటీ కాదని, పశుపోషకుల్లో ఆత్మవిశ్వాసం నింపే విప్లవాత్మక ఉద్యమమని తెలిపారు. శాసీ్త్రయ పద్ధతుల్లో పాడి పెంపకం, మెరుగైన పశుజాతులు, సమతుల్య పోషణ, పాల దిగుబడి పెంపు, కృత్రిమ గర్భధారణ తదితర అంశాలపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం పోస్టర్లను విడుదల చేశారు.
యువకుడి ఆత్మహత్య
అనంతపురం సెంట్రల్: తెలంగాణకు చెందిన ఓ యువకుడు అనంతపురంలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన ఓ గాలిమరల కంపెనీలో ఐటీ ఇంజనీర్‌గా పనిచేస్తున్న వికారాబాద్‌కు చెందిన మహమ్మద్ అమీర్(25) కొన్ని రోజుల క్రితం గాలి మరల ఏర్పాటుకు స్థల పరిశీలన కోసం అనంతపురానికి వచ్చి రామ్‌నగర్ త్రివేణి హోమ్స్‌లో ఓ ఇంటిని అద్దెకు తీసుకుని ఉంటున్నాడు. మంగళవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రేమ వ్యవహారమే ఇందుకు కారణంగా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కుటుంబసభ్యులకు సమాచారం అందించామని, వారు వచ్చిన తర్వాత చేసే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని నాల్గో పట్టణ సీఐ జగదీష్ తెలిపారు.
వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యం కావాలి


