చేతిరాత అందంగా ఉండాలి : డీఈఓ
అనంతపురం సిటీ: చేతిరాత అందంగా ఉంటే వారి హృదయం అంతే అందంగా ఉంటుందని డీఈఓ ప్రసాద్‌బాబు అన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని పిల్లలకు చిన్నప్పటి నుంచే చేతి రాత అందంగా ఉండేలా సాధన చేయించాలని ఉపాధ్యాయులకు సూచించారు. అనంతపురంలోని అరవిందనగర్‌లో ఉన్న ఎస్‌కేడీ నగర పాలక ప్రాథమిక పాఠశాలను ఆయన మంగళవారం సందర్శించారు. విద్యార్థుల వర్క్ బుక్స్, జీ–ఎఫ్‌ఎల్‌ఎన్ మెటీరియల్, ఎఫ్–3 అసెస్మెంట్ బుక్కులను పరిశీలించారు. తెలుగు, ఆంగ్లం పాఠ్యాంశాలపై ప్రశ్నలు అడిగి సమాధానాలు రాబట్టారు. విద్యార్థుల డ్రాప్ అవుట్ లేకుండా చూడాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. అనంతరం రాప్తాడులోని జెడ్పీహెచ్‌ఎస్‌ను తనిఖీ చేశారు. వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతుల నిర్వహణను పరిశీలించారు.
11 మంది మట్కా బీటర్ల అరెస్ట్
తాడిపత్రి టౌన్: పట్టణంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం రాత్రి మట్కా రాస్తూ 11 మంది బీటర్లు పట్టుబడినట్లు సీఐ ఆరోహణరావు తెలిపారు. వీరి నుంచి రూ.1.40 లక్షలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు వివరించారు.
సీటు కోసం బస్సులో కొట్టుకున్న మహిళలు
ఉరవకొండ: ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళలు జుట్లు పట్టుకుని కొట్టుకున్నారు. ఈ ఘటన మంగళవారం ఉరవకొండ ఆర్టీసీ డిపో నుంచి రాయదుర్గానికి వెళ్లే బస్సులో చోటు చేసుకుంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉరవకొండ నుంచి కణేకల్లు మీదుగా రాయదుర్గం వెళుతున్న రాయదుర్గం డిపోకు చెందిన బస్సులో సీటు కోసం ఇద్దరు మహిళ ప్రయాణికులు మధ్య గొడవ ప్రారంభమైంది. నింబగల్లు సమీపంలో గొడవ తీవ్ర రూపం దాల్చి ఒకరినొకరు దుర్భాషలాడుకుంటూ పరస్పరం కొట్టుకున్నారు. బస్సు డ్రైవర్, కండక్టర్, తోటి ప్రయాణికులు ఎంతగా వారించినా వినిపించుకోలేదు. డ్రైవర్ బస్సును ఉరవకొండ పీఎస్‌కు తీసుకెళ్లి గొడవ పడుతున్న ఇద్దరు మహిళలను పోలీసులకు అప్పగించారు. మహిళలకు ఉరవకొండ సీఐ మహనంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు.
చేతిరాత అందంగా ఉండాలి : డీఈఓ


