‘ఉపాధి’ పేరు మార్పుపై అవగాహన కల్పించండి
● జెడ్పీ సీఈఓ శివశంకర్
కళ్యాణదుర్గం (కంబదూరు): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టానికి బదులుగా వికసిత్ భారత్ జీ రామ్ జీ చట్టం కింద కేంద్ర ప్రభుత్వం పేరు మార్చిందని, ఈ విషయంపై ఉపాధి కూలీలకు అవగాహన కల్పించాలని జెడ్పీ సీఈఓ శివశంకర్ సూచించారు. కంబదూరులోని సచివాలయం వద్ద సోమవారం నిర్వహించిన గ్రామ సభలో ఆయన మాట్లాడారు. గతంలో ఉపాధి పని దినాలను కేంద్రం 100 రోజులకు నిర్ణయించిందన్నారు. అయితే ఇటీవల కూలీలకు 125 రోజులు పనిదినాలు పెంచుతూ నిర్ణయం తీసుకుందన్నారు. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణ, ఏపీఎం రాజశేఖర్, ఏపీఓ శ్రీదేవి, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
గంగావతిలో
ఉరవకొండ వాసి అరెస్ట్
హొసపేటె: కర్ణాటకలోని కొప్పళ జిల్లా గంగావతి పోలీసులు రెండు వేర్వేరు చోరీ కేసుల్లో ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి రూ.13.10 లక్షల విలువైన సొత్తుని స్వాధీనం చేసుకున్నారు. వివరాలను గంగావతి డీఎస్పీ న్యామగౌడ వెల్లడించారు. పట్టుబడిన వారిలో అనంతపురం జిల్లాలోని ఉరవకొండ పట్టణం మారెమ్మ గుడి ప్రాంతానికి చెందిన రామాంజనేయ అలియాస్ రామాంజి గురుస్వామి, హొసపేటె తాలూకాలోని మలపనగుడి నివాసి మహేష్ గురుస్వామి ఉన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి, న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
హోరాహోరీగా
ఫుట్‌బాల్ పోటీలు
అనంతపురం కార్పొరేషన్: అనంతపురం స్పోర్ట్స్ అకాడమీలో జరుగుతున్న ఇన్‌స్పైర్ ఫుట్‌బాల్ కప్ టోర్నీ పోటీలు సోమవారం హోరాహోరీగా సాగాయి. తొలి మ్యాచ్‌లో మగన్‌సింగ్ రాజీవ్ ఎఫ్‌సీ జట్టు 5–0 గోల్స్ తేడాతో అనంతపురం స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై ఘనవిజయం సాధించింది. అలాగే నర్మద వాలీ ఎఫ్‌సీ జట్టు 6–0 గోల్స్ తేడాతో తాండమ్ ఫౌండేషన్ జట్టుపై విజయకేతనం ఎగురవేసింది. పదువయ్ యూనికార్న్ జట్టు ఏకంగా 18–0 గోల్స్ తేడాతో లైఫ్ స్పోర్ట్స్ అకాడమీ జట్టుపై విజయఢంకా మోగించింది. ఫజల్ ఎఫ్‌సీ జట్టు 12–0 గోల్స్ తేడాతో నాంది ఫౌండేషన్ జట్టుపై, యువ ఫౌండేషన్ 3–0 గోల్స్ తేడాతో ఆస్కార్ ఫౌండేషన్ జట్టుపై గెలుపొందాయి.


