రైతుల సమస్యలు పట్టని ఎమ్మెల్యే
బుక్కరాయసముద్రం: శింగనమల నియోజకవర్గ రైతుల సమస్యలు స్థానిక ఎమ్మెల్యేకు పట్టడం లేదని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజమెత్తారు. సోమవారం సాయంత్రం బీకేఎస్‌లోని నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు సమస్యలతో రైతులు కొట్టుమిట్టాడుతున్నారన్నారు. సాగు నీటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందన్నారు. అదునులో నీరు అందకపోవడంతో పంట నష్టాలను చవి చూడాల్సి వస్తోందన్నారు. పుట్లూరు మండలంలోని గరుకుచింతపల్లి, పుట్లూరు చెరువు, కోమటి కుంట్ల చెరువులకు నీరు అందకపోవడంతో కనీసం తాగునీటికీ ఇబ్బందులు పడాల్సి వస్తోందన్నారు. సుబ్బరాయ సాగర్ షట్టర్లు పని చేయడం లేదని బుకాయించడం దారుణమన్నారు. ప్రశ్నిస్తే రాజకీయం చేస్తున్నారనడం సరికాదన్నారు. రెండు నెలలుగా కాలయాపన చేసి నేటికీ చెరువులకు నీరు అందిచక పోవడం వెనుక ఎమ్మెల్యే వైఫల్యం స్పష్టంగా కనబడుతోందన్నారు. సాగునీటి అంశంపై ఈ నెల 7న ఉదయం 10 గంటలకు హెచ్చెల్సీ అధికారులతో మాట్లాడనున్నామని, రైతులు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు గువ్వల శ్రీకాంత్‌రెడ్డి, జెడ్పీటీసీ భాస్కర్, నాయకులు పూల ప్రసాద్, సర్పంచ్ పార్వతి, పూల నారాయణస్వామి, చికెన్ నారాయణస్వామి, ముత్యాలశీన పురుషోత్తం, సత్య నారాయణ, తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి శైలజానాథ్ ధ్వజం


