వ్యవసాయ పనిముట్లు ఇస్తామంటూ బురిడీ
బ్రహ్మసముద్రం: సబ్సిడీతో వ్యవసాయ పనిముట్లు, యంత్రాలు ఇస్తామంటూ రైతులకు ఓ యువకుడు కుచ్చుటోపీ పెట్టి ఉడాయించిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. బాధిత రైతులు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం గుడిగానిపల్లికి చెందిన పోలేపల్లి నవీన్ తాను ఐసీఐసీఐ ఫౌండేషన్‌లో ఫీల్డ్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నట్లు కళ్యాణదుర్గం, రాయదుర్గం, తాడిపత్రి, గుంతకల్లు, కదిరి నియోజకవర్గాల్లో పలువురు రైతులతో పరిచయం పెంచుకున్నాడు. రోటోవేటర్, స్ప్రేయర్లు తదితర వ్యవసాయ పనిముట్లను 50 శాతం సబ్సిడీతో అందజేస్తున్నామని రైతు వాటా కింద మొత్తం చెల్లించాలని సూచించాడు. దీంతో అతని మాటలు నమ్మిన పలువురు రైతులు రూ.లక్షల్లో చెల్లించారు. ఒక్క బ్రహ్మసముద్రం మండలంలోనే రూ.5 లక్షలకు పైగా వసూలు చేసినట్లు సమాచారం. రోజులు గడుస్తున్నా వ్యవసాయ పనిముట్లు అందకపోవడంతో రైతులకు అనుమానం వచ్చి మూడు నెలల క్రితం గట్టిగా నిలదీశారు. దీంతో రాత్రికి రాత్రే అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఫోన్ కూడా పని చేయకపోవడంతో మూడు నెలలుగా అతని ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఈ క్రమంలోనే వనీన్‌తో పాటు అదే గ్రామానికి చెందిన రవి, మంజునాథ్ బెంగళూరు కేంద్రంగా రైతులను మోసం చేస్తున్నట్లుగా గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయినా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా రాజకీయ నాయకులతో సంప్రదింపులతో కాలయాపన చేస్తున్నారని బాధితులు వాపోయారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి మోసగాడిని అరెస్ట్ చేసి, కఠినంగా శిక్షించడంతో పాటు తమ డబ్బు తమకు వెనక్కు ఇప్పించాలని కోరుతున్నారు.


