నేడు బొమ్మనహాళ్ ఎంపీపీ ఎన్నిక
● కల్పన, నాగమణి మధ్య పోటీ
బొమ్మనహాళ్: బొమ్మనహాళ్ మండల పరిషత్ అధ్యక్ష (ఎంపీపీ) స్థానానికి సోమవారం ప్రత్యేకాధికారి గంగాధర్ ఆధ్వర్యంలో ఎన్నిక నిర్వహించనున్నారు. రాజకీయ ఉద్రికత్తలు తలెత్తకుండా మండల కేంద్రంలో భారీగా పోలీసులు మోహరించి కట్టదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో 16 మంది ఎంపీటీసీ సభ్యులు ఉన్నారు. ఎన్నిక చెల్లుబాటు కావాలంటే కనీసం 9 మంది హాజరు కావాల్సి ఉంది. ఈ ఎన్నికల్లో ఎంపీపీ పదవికి ఉద్దేహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు కరూరు కల్పన, ఉప్పరహాళ్ ఎంపీటీసీ సభ్యురాలు ముల్లంగి నాగమణి పోటీపడుతున్నారు. అయితే మండలంలో నెలకొన్న రాజకీయ సమీకరణలు, ఎంపీటీసీ సభ్యుల మద్దతు లెక్కలు పరిశీలిస్తే కరూరు కల్పనకే సృష్టమైన ఆధిక్యం ఉందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. సభ్యులతో నిరంతర సంబంధాలు కొనసాగించడం మండల అభివృద్ది అంశాలపై సృష్టమైన దృష్టి ఉండటం కరూరు కల్పపనకు ప్రధాన బలంగా మారిందని సమాచారం. ఎన్నికలు ప్రశాంతంగా సాగేందుకు కళ్యాణదుర్గం డీఎస్పీ రవిబాబు పర్యవేక్షణలో ముగ్గురు సీఐలు, పది మంది ఎస్‌ఐలు, 20 మంది ఏఎస్‌ఐలు, హెడ్ కానిస్టేబుళ్లు, 30 మంది కానిస్టేబుళ్లు, పది మంది మహిళా కానిస్టేబుళ్లు, 20 మంది స్పెషల్ పార్టీ పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.


