సహజ వనరుల దోపిడీ
అనంతపురం టౌన్: జిల్లాలో సహజ వనరుల దోపిడీకి అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఐదేళ్ల క్రితం సీజ్ చేసిన క్వారీల్లోనూ ఎలాంటి అనుమతులు లేకుండా భారీ యంత్రాలను పెట్టి రేయింబవశ్లూ ఖనిజాన్ని వెలికి తీస్తున్నా ఏ అదికారీ పట్టించుకోవడం లేదు. రూ.కోట్లలో జరిమానాల డిమాండ్ నోటీసులు అందుకున్న లీజుదారులు వాటిపై రివిజన్‌కు వెళ్లకుండానే స్థానిక ఎమ్మెల్యేల అండతో ప్రభుత్వానికి నయాపైసా చెల్లించకుండా అక్రమ తవ్వకాలు చేపట్టడం గమనార్హం. అనంతపురం రూరల్ మండలం చియ్యేడులో దాదాపు నాలుగు రోడ్డు మెటల్ క్వారీలు గతంలోనే అధికారులు సీజ్ చేశారు. బొమ్మనహాల్ మండలం నేమకల్లులోనూ 9 క్వారీలకు జరిమానాలు విధించి నోటీసులు జారీ చేశారు. అయితే ప్రస్తుతం ఈ రెండు ప్రాంతాల్లోనూ జీరో పర్మిట్లతో ఏడాదిన్నరగా ఇష్ఠారాజ్యంగా రోడ్డు మెటల్‌ను వెలికి తీసి అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయం గనుల శాఖ అధికారులకు తెలిసినా అటుగా కన్నేత్తి చూసే సాహసం కూడా చేయలేక పోతున్నారు.
జోరుగా ఎర్రమట్టి దందా..
జిల్లాలో ఎర్రమట్టి తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. ఈ క్రమంలో అక్రమార్కులు కన్ను పడిన కొండలు, గుట్టలు కాస్త కనుమరుగైపోతున్నాయి. గ్రావెల్ లీజు లేకుండానే అక్రమంగా మట్టిని జేసీబీలతో తవ్వి ఇతర ప్రాంతాలకు తరలించి పెద్ద మొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. ఆత్మకూరు మండలం వై కొత్తపల్లిలో 10 రోజులుగా హంద్రీ–నీవా కాలువ గట్టు పక్కనే ఉన్న గుట్టను కరిగించేశారు. బుక్కరాయసముద్రం, రాప్తాడు మండలాలతో పాటు కూడేరు మండలంలోని గొటుకూరులోనూ పెద్ద ఎత్తున ఎర్రమట్టి దందా కొనసాగుతోంది. స్థానిక ప్రజాప్రతినిధుల అండతో మట్టిని తవ్వి వెంచర్లకు తరలిస్తున్నట్లుగా ఆరోపణలున్నాయి. బుక్కరాయసముద్రం మండలంలో మట్టి తవ్వకాలు, తరలింపులకు సంబంధించి స్థానిక ప్రజాప్రతినిధుల కుటుంబసభ్యులు కమీషన్లు దండుకుని, వాహనాలు పట్టుబడిన సమయంలో అధికారులపై తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు తీసుకెళ్లి ఎలాంటి వివాదం లేకుండా పరిష్కరిస్తున్నట్లు సమాచారం.
అధికారం అండ చూసుకుని
చెలరేగిన టీడీపీ నాయకులు
సీజ్ చేసిన క్వారీలో
అక్రమంగా ఖనిజం వెలికితీత
గ్రావెల్ లీజు లేకున్నా
ఎర్రమట్టి తవ్వకాలు
కాలువ గట్లను చిధ్రం చేస్తున్న వైనం
ప్రజాప్రతినిధుల అండతో
యథేచ్ఛగా అక్రమాలు
పట్టించుకోని గనులశాఖ అధికారులు
చర్యలు తీసుకుంటాం
ఇప్పటికే చియ్యేడు, నేమకల్లు ప్రాంతాల్లోని రోడ్డు మెటల్ క్వారీలపై ఫిర్యాదులు అందాయి. పూర్తి స్థాయిలో విచారణ అక్రమాలు నిర్ధారణ అయితే చర్యలు తీసుకుంటాం. ఎర్రమట్టి రవాణా అక్రమాలను సైతం అడ్డుకుంటాం. – ఆదినారాయణ, డీడీ గనులశాఖ


