సంప్రదాయాలను పాటించినప్పుడే బ్రాహ్మణులకు పూర్వ వైభవం
● ఏబీబీఎం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాదఽశర్మ
అనంతపురం కల్చరల్: పూర్వ వైభవం కోసం సమష్టిగా శ్రమించాల్సిన సమయం ఆసన్నమైందని బ్రాహ్మణులకు బ్రాహ్మణ సంఘం రాష్ట్ర నాయకులు పిలుపునిచ్చారు. అనంతపురంలోని తపోవనంలో ఉన్న వేదమాత గాయత్రి ఆలయం వేదికగా ఆదివారం ఏబీబీఎం (అఖిల భారతీయ బ్రాహ్మణ మహాసంఘ్), అనంత బ్రాహ్మణ సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో బ్రాహ్మణ సమ్మేళనం, భార్గవ పురస్కారాల ప్రదానోత్సవం వైభవంగా సాగింది. ఉంతకల్లు వంశీకృష్ణ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏబీబీఎం రాష్ట్ర అధ్యక్షుడు ఇంద్రగంటి ప్రసాదశర్మ, ఏబీబీఎం జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్రాచార్, అవధాని జోస్యుల సదానందశాస్త్రి, శ్రీజ్ఞానపీఠం వ్యవస్థాపకుడు మధుసూదనరావు, అలనాటి నటుడు చిత్తూరు నాగయ్య మనవడు మధుసూదనశర్మ, డీఆర్వో మలోల తదితరులు ఆత్మీయ అతిథులుగా విచ్చేసి మాట్లాడారు. బ్రాహ్మణులకు మాత్రమే నిర్దేశించిన సంప్రదాయాలు, ఆచారాలను పాటించడం ద్వారా పూర్వపు కీర్తిని లభిస్తుందన్నారు. సమాజహితంగా మెలిగే స్వభావాన్ని నేటి తరంలో నింపాలన్నారు. అనంతరం వివిధ ప్రాంతాలలో స్థిరపడి, వేర్వేరు రంగాల అభివృద్ధిలో పాలు పంచుకుంటున్న 52 మంది బ్రాహ్మణ ప్రముఖులకు భార్గవ పురస్కారాలను అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం వేదమాత గాయత్రి ఆలయ క్యాలెండర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సంధ్యామూర్తి, పట్నం శివప్రసాద్, కై పా హరిప్రసాదశర్మ, వరప్రసాద్, లతాశ్యామ్, శాస్త్రి, కల్యాణి, నిర్వాహకులు ధూళిపాళ్ల సురేష్‌శర్మ, సాయికిరణ్, యాదవల్లి సుబ్రహ్మణ్యశర్మ, సాయికిరణ్, శ్రీనిధి రఘు, లంకా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసం
బ్రహ్మసముద్రం: కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వ ఉధ్యోగం ఇప్పిస్తానంటూ నమ్మబలికి ఓ నిరుద్యోగిని కూటమి నాయకులు మోసగించి సొమ్ము చేసుకున్న వైనం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు తెలిపిన మేరకు... బ్రహ్మసముద్రం మండలం సంతే కొండాపురం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త హనుమంతరాయుడు పలువురు నిరుద్యోగులను కలసి ఎమ్మెల్యే అమిలినేనితో చెప్పి ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానమంటూ నమ్మబలుకుతూ వచ్చాడు. ఇతని మాయలో చిక్కుకున్న ఓ యువకుడు ప్రభుత్వాస్పత్రిలో అటెండర్ ఉద్యోగం కోసమని రూ.40 వేలను అప్పగించాడు. తన వద్ద అంత డబ్బు లేకపోయినా ఉద్యోగం వస్తుందన్న ఆశతో వడ్డీ వ్యాపారుల వద్ద రూ.5 వడ్డీ చెల్లించేలా అప్పు చేసి తీసుకువచ్చి ఇచ్చాడు. రోజులు గడుస్తున్న ఉద్యోగం రాకపోవడంతో తాను మోసపోయినట్లుగా నిర్ధారించుకుని తన డబ్బు వెనక్కు ఇవ్వాలని హనుమంతరాయుడిని అడిగాడు. డబ్బు వెనక్కు ఇవ్వడం కుదరని, ఉధ్యోగం ఇప్పించేలా ఇప్పటికే ఎమ్మెల్యే అల్లుడు ధర్మతేజతో మాట్లాడానని, త్వరలో పోస్టింగ్ ఆర్డర్ అందుతుందని ఆశలు కల్పించాడు. రెండు రోజులుగా హనుమంతరాయుడు పత్తాలేకుండా పోయాడు. అతనితో పాటు రోజూ తనతో ఫోన్‌లో మాట్లాడుతున్న దుర్గప్ప (హనుమంతరాయుడుకు బాస్‌గా) ను బాధితుడు ఆరా తీయగా.. రాయుడు చెప్పినట్లుగానే తాను ఫోన్‌లో మాట్లాడానని, ఈ మోసంతో తనకు ఎలాంటి సంబంధం లేదని జారుకున్నాడు. దీంతో విషయాన్ని ఎస్పీ దృష్టికి సోమవారం తీసుకెళ్లి న్యాయం కోరనున్నట్లు బాధితుడు పేర్కొన్నాడు.


