విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు
అనంతపురం సిటీ: రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అనుసరిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని, విద్యా వ్యవస్థ భ్రష్టుపట్టిపోతోందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులందరూ ఐక్యంగా ఉండి విద్యా వ్యవస్థ పరిరక్షణ కోసం పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన పేర్కొన్నారు. అనంతపురం సమీపంలోని బీజీఆర్ ఫంక్షన్ హాలులో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఏపీ వైఎస్సార్‌టీఏ రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్లు, డైరీలు, స్టిక్కర్లను ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై.విశ్వేశ్వరరెడ్డితో కలసి అనంత ఆవిష్కరించారు. అసోసియేషన్ రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అశోక్‌కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గౌడ్, గౌరవాధ్యక్షుడు గోపాల్ హాజరయ్యారు. అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ హయాంలో రూ.60 వేల కోట్లు ఖర్చుపెట్టి పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారని గుర్తు చేశారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టి, విద్యార్థులకు ట్యాబ్‌లు కూడా అందించారని తెలిపారు. పాఠశాలల్లో ఐఎఫ్‌పీ ప్యానల్ ఏర్పాటు చేయడం, విద్యార్థులకు కలర్‌ఫుల్ డెస్క్‌లు, బ్యాగులు సరఫరా చేశారని పేర్కొన్నారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను అభివృద్ధి చేశారన్నారు. అయితే చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అయిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఆర్‌సీ, ఐఆర్ ప్రకటించకపోగా, డీఏలు కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. రకరకాల యాప్‌లు, ప్రయోగాలతో ఉపాధ్యాయులు, విద్యార్థులపై ఒత్తిళ్లు పెంచినట్లు దుయ్యబట్టారు. ఈ పరిస్థితుల్లో ఉపాధ్యాయులందరూ యూనియన్లకు అతీతంగా ఒక్కతాటిపై వచ్చి ఐక్య పోరాటాలు చేయకపోతే ఉనికి కోల్పోయే ప్రమాదముందని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏపీ వైఎస్సార్‌టీఏ రాష్ట్ర నాయకులు గోవిందరెడ్డి, రాధాకృష్ణారెడ్డి, వెంకటరమణప్ప, జిల్లా నాయకులు కృష్ణా నాయక్, చంద్రశేఖర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, రామకృష్ణ, సురేశ్‌కుమార్‌రెడ్డి, ఓబిరెడ్డి, జిల్లా ట్రెజరర్ నారాయణ, ఆంథోనిరెడ్డి, సత్యనారాయణరెడ్డి, మహేంద్ర, సాయినాథ్‌రెడ్డి, డాక్టర్ వెంకటరెడ్డి, సాంబశివారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పరిరక్షణకు ఉపాధ్యాయులు
ఉద్యమించాలి
వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
అనంత వెంకటరామిరెడ్డి


