బాబు చేతిలో రాష్ట్రం సర్వనాశనం
తాడిపత్రి టౌన్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో సీఎం చంద్రబాబు చేసుకున్న రహస్య ఒప్పందం కాస్త ఏపీకి మరణ శాసనమైందని తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి మండిపడ్డారు. స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వ్యూహాత్మకంగా రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టారన్నారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలు, చైన్నె తాగునీటి అవసరాలకు తీర్చేందుకు ఏర్పాటు చేసిన పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ప్రస్తుతమున్న డిజైన్ మేరకు 44వేల క్యూసెక్కుల నీరు తీసుకునేందుకు వీలు ఉంటుందని, ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు 101 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయని వివరించారు. 880 అడుగుల కన్నా ఎక్కువ ఎత్తులో నీరు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి పూర్తి స్థాయిలో నీళ్లు తీసుకునే వీలు ఉంటుందన్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం 798 అడుగుల ఎత్తుకు నీరు చేరగానే విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు వదిలేస్తోందన్నారు. అంతేకాక శ్రీశైలం నుంచి 800 అడుగుల ఎత్తు నుంచి నీళ్లు ఎత్తిపోసేందుకు తెలంగాణ రాష్ట్రం పలు ప్రాజెక్ట్‌లు చేపట్టిందన్నారు. ఈ పనులు పూర్తయితే రాయలసీమ ప్రాంతానికి తాగు, సాగు నీరు అందకుండా పోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డితో చంద్రబాబు చేతులు కలిపి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు మరణ శాసనం రాసారన్నారు. గతంలో చంద్రబాబు వైఖరితోనే ఆల్మట్టి రూపంలో ఓ శాపం రాష్ట్ర ప్రజలను వెన్నాడుతోందన్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టి కేంద్రం కట్టాల్సిన పోలవరం ప్రాజెక్ట్‌ను కమీషన్ల కోసం కక్కూర్తి పడి చేతుల్లోకి తీసుకున్నాడన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి కోలుకోలేని దెబ్బ తగులుతోందన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను తెలంగాణ ప్రభుత్వం ఆపేయడం వెనుక చంద్రబాబు సొంత ఆర్థిక ప్రయోజనాలున్నాయని, ఈ విషయాన్ని గుర్తించి రాయలసీమ ప్రాంత టీడీపీ ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం ద్వారా ఈ కుట్రను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. అలా కాదని రాష్ట్రానికి, రాయలసీమకు ద్రోహం చేస్తున్న ప్రభుత్వంలో మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా కొనసాగుతామంటే చరిత్ర హీనులుగాా మిగిలిపోతారని హెచ్చరించారు.
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి


