పామిడి సీహెచ్‌సీలో అరుదైన శస్త్రచికిత్స
పామిడి: స్థానిక కమ్యూనిటీ ఆస్పత్రిలో ఆదివారం వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి ఓ మహిళ ప్రాణాలు కాపాడారు. వివరాలు.. అనంతపురంలోని మరువకొమ్మ కాలనీకి చెందిన ఉన్నె సులేమా కుటుంబనియంత్రణ శస్త్రచికిత్స కోసం పామిడిలోని సీహెచ్‌సీ వైద్యులను సంప్రదించింది. వైద్య పరీక్షల అనంతరం ఆమెకు ఎడమ అండాశయంలో 7 x 6 సెం.మీ. పరిమాణంలో కణితి ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. విషయాన్ని వెంటనే ఆమెకు తెలిపి ఆదివారం వైద్యాధికారి శివకార్తీక్‌రెడ్డి ఆధ్వర్యంలో జనరల్ సర్జన్ కమలాధర్, అనస్తీషియా నిపుణులు వైఎస్ రాఘవేంద్రరెడ్డి, హెడ్‌నర్సు శివకుమారి బృందం శస్త్రచికిత్స నిర్వహించి కణితిని తొలగించారు. శస్త్రచికిత్స అనంతరం రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని వైద్యులు తెలిపారు.


