గెలుపోటములను సమానంగా స్వీకరించాలి
అనంతపురం సిటీ: గెలుపోటములను సమానంగా స్వీకరించాలని ఎస్కేయూ స్సోర్ట్స్ సెక్రటరీ జెస్సీ పిలుపునిచ్చారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల క్రీడా మైదానంలో శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ అంతర్ కళాశాలల అథ్లెటిక్స్ శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పూజారి పద్మశ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి జెస్సీ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. విద్యార్థులు క్రీడా స్ఫూర్తి చాటాలన్నారు. చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించాలని ప్రిన్సిపాల్ పద్మశ్రీ ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సహదేవుడు, పీడీ శ్రీరాం పాల్గొన్నారు.
పోలీసులపైనే దౌర్జన్యమా?
అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లా జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి అనుచరుడు పోలీసులపై దౌర్జన్యంగా వ్యవహరించడం హేయమైన చర్య అని వైఎస్సార్‌సీపీ పంచాయతీ రాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్ర రెడ్డి పేర్కొన్నారు. అనంతపురంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పోలీసులకే గౌరవం, రక్షణ లేని పరిస్థితి నెలకొందన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎదుటే ఆయన వర్గీయులు సీఐని దుర్భాషలాడితే.. ఆయన తన వర్గానికే వత్తాసు పలకడం అప్రజాస్వామ్యానికి పరాకాష్ట అని అభివర్ణించారు. బాధ్యాతాయుతమైన పదవిలో ఉన్న ఓ ఎమ్మెల్సీ రౌడీలను ప్రోత్సహించడం సమంజసం కాదన్నారు. క్రమశిక్షణగా ఉండాల్సిన ఎమ్మెల్సీ ఇలాంటి వారికి అండగా ఉండడంతో పాటు సమాజంలో బ్లాక్ మెయిల్ ఎమ్మెల్సీగా చలామణి అవుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తక్షణమే పోలీసులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లైంగిక వేధింపుల కేసులో మరో వ్యక్తి అరెస్ట్
రాప్తాడురూరల్: రాప్తాడు మండల పరిధిలోని చిన్మయనగర్ పంచాయతీ కళాకారుల కాలనీ సమీపంలో మైనర్ బాలుడిని లైంగికంగా వేధించిన కేసులో శనివారం రాప్తాడు పోలీసులు మరో వ్యక్తిని అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గతేడాది నవంబరులో కళాకారుల సమీపంలో ఓ మైనర్ బాలుడిని ముగ్గురు యువకులు లైంగికంగా వేధించారు. ఈ కేసులో ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు. మూడో నిందితుడు ఎరుకుల గంగన్నను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జడ్జి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించారు.
మధ్యలో ఆగి..
చుక్కలు చూపి
కూడేరు: కాలం చెల్లిన ఆర్టీసీ బస్సులతో ప్రయాణికులకు అవస్థలు తప్పడం లేదు. ఆర్టీసీ బస్సులు ఎక్కడపడితే అక్కడ ఆగిపోతున్నాయి. శనివారం ఉరవకొండ డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు అనంతపురం నుంచి ఉరవకొండకు వెళుతోంది. అందులో సుమారు 25 మంది వరకు ప్రయాణికులు ఉన్నారు. కూడేరు దాటిన తర్వాత ఇంజిన్ దగ్గర ఉన్న ఫ్యాన్ బెల్టు తెగిపోయి బస్సు ఆగిపోయింది. దీంతో ప్రయాణికులు మరో బస్సు కోసం పడిగాపులు కాశారు. చాలాసేపైనా మరో బస్సు రాకపోవడంతో చుక్కలు కనిపించాయని, ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని ఊదరగొట్టే అధికారులు బస్సులను మాత్రం కండీషన్‌లో పెట్టరంటూ ప్రయాణికులు మండిపడ్డారు.
గెలుపోటములను సమానంగా స్వీకరించాలి


