మీ పిల్లలకూ ఇలాగే వండిపెడతారా?
ఆత్మకూరు: ‘అంగన్‌వాడీ కేంద్రాల్లో మిమ్మల్ని నమ్మి పిల్లల్ని వదిలి వెళ్తున్నాం. అలాంటి పిల్లలను పశువుల కంటే హీనంగా చూస్తున్నారు. ఎలా పడితే అలా వంటలు వండిపెడుతున్నారు. మీ పిల్లలైతే వారికీ ఇలాగే చేస్తారా..?’ అంటూ ఆత్మకూరు భగత్‌సింగ్ కాలనీ వాసులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 8వ అంగన్ వాడీ సెంటర్‌లో మెనూ అమలు చేయడం లేదని, సిబ్బంది సమయ పాలన పాటించలేదని స్థానికులు ఫిర్యాదు చేయడంతో శనివారం ఎంపీడీఓ లక్ష్మినరసింహ, సీపీడీఓ ఉమాశంకరమ్మ సదరు కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చిన్నారుల తల్లులు, లబ్ధిదారులు మాట్లాడుతూ రోజూ రూ.5 విలువ చేసే పులిహోర ప్యాకెట్ తీసుకువచ్చి వండుతున్నారని ఆరోపించారు. నిత్యం పులిహోర, చిత్రాన్నం తప్ప వేరేది వండ డం లేదని, ఇలా అయితే పిల్లల్ని ఎందుకు అంగన్‌వాడీ కేంద్రాలకు పంపాలని ప్రశ్నించారు. ఉదయం 9 గంటలకు తీయాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలను 11 గంటలకు తీసి మధ్యాహ్నం 2 గంటలకే మూసేస్తున్నారని తెలిపారు. కుళ్లిపోయిన కూరగాయలతో వండుతున్నారన్నారు. మరుగుదొడ్లు సరిగా లేకపోవడంతో పిల్లల్ని బయటకు పంపుతున్నారని, ఈ క్రమంలో పిల్లలకు ఏమైనా జరిగితే ఎవరిది బాధ్యత అని మండిపడ్డారు. మరుగుదొడ్ల శుభ్రత, మరమ్మతులకు రూ.3 వేలు వస్తే ఏం చేశారు అని ఎంపీడీఓ అంగన్‌వాడీ కార్యకర్తను ప్రశ్నించగా, ఆమె సరైన సమాధానం చెప్పలేకపోయారు. రెండు రోజుల నుంచి తాను 8వ సెంటర్‌ను పరిశీలిస్తున్నానని గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారంలో సగం సగం ఇస్తే ఎలా అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పిల్లలకు అందించే సరుకులు లేకపోతే ఎలా వండిపెడతారని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా ఉన్న వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఎస్‌డీటీ లక్ష్మిదేవి, సూపర్‌వైజర్ లావణ్య పాల్గొన్నారు.


