గ్యాస్ సిలిండర్ పేలుడు
● పది మందికి గాయాలు
తాడిపత్రి రూరల్: గ్యాస్ గీజర్‌కు అమర్చిన సిలిండర్ నుంచి వస్తున్న మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా సిలిండర్ పేలింది. ఈ ఘటనలో ఇంట్లోని వారితో పాటు మంటలు ఆర్పేందుకు వచ్చిన చుట్టుపక్కల వారు మొత్తం పది మంది గాయపడ్డారు. తాడిపత్రి సమీపంలోని గన్నెవారిపల్లికాలనీలో ఈ ఘటన జరిగింది. సీఐ శివగంగాధర్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గన్నెవారిపల్లికాలనీలో నివాసం ఉంటున్న ఏకాంబరం.. ఇంటి కింది పోర్షన్‌ను జనార్దన్‌కు బాడుగకు ఇచ్చాడు. శనివారం రాత్రి బాత్‌రూంలోని గీజర్‌కు బిగించిన గ్యాస్ సిలిండర్ నుంచి మంటలు రావడంతో జనార్దన్ గట్టిగా కేకలు వేశాడు. పై అంతస్తులో ఉన్న ఏకాంబరంతో పాటు చుట్టుపక్కల వారు మంటలను ఆర్పివేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో పెద్ద శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో జనార్దన్‌తో పాటు భార్య జ్యోతి, పిల్లలు చరణి, చరిత, ఇంటి యజమాని ఏకాంబరం, మంటలు ఆర్పడానికి వచ్చిన చుట్టుపక్కల వారు రాజేష్, నాగరంగయ్య, సాయిప్రశాంత్, ఉమాదేవి, పాలనరసింహులుకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఫైర్ సిబ్బంది వచ్చి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వారిని మెరుగైన చికిత్స కోసం ఆనంతపురం పంపించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అప్‌గ్రేడ్ స్టేషన్ సీఐ శివంగంగాధర్‌రెడ్డి తెలిపారు.


