అందరివాడికి అశ్రునివాళి
రాప్తాడురూరల్: ఎక్కడ పుట్టాడో తెలీదు. ఏ ఊరో తెలీదు. తెలుగు భాష అసలేరాదు...‘మా’ అనే పదం తప్ప ఆయన నోటి నుంచి ఇతరమాట వచ్చేదికాదు. అయినా ఆ ఊరందరికీ దగ్గరయ్యాడు. అలాంటి వ్యక్తి చనిపోయిన విషయం తెలుసుకున్న గ్రామస్తులంతా కులమతాలకతీతంగా అంత్యక్రియలు నిర్వహించడం ఆసక్తి కలిగించింది. వివరాలు.. 42 ఏళ్ల క్రితం అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లికి ఓ వ్యక్తి వచ్చాడు. కృష్ణంరెడ్డిపల్లిలో చావిడిలో ఉండేవాడు. సమీప తోటలు, బోరుబావుల వద్ద స్నానం చేసేవాడు. ఇళ్లవద్దకు వెళ్లి వారు ఏమైనా పెడితే తీసుకుని వచ్చి తిని అక్కడే పడుకునేవాడు. కొత్తలో గ్రామస్తులు వింతగా చూసేవారు. తొలినాళ్లలో ముఖ్యంగా మహిళలు ఆయనను చూసి భయపడేవారు. అయితే ఎవరినీ పల్లెత్తు మాట మాట్లాడకపోవడంతో అందరూ అలవాటయ్యారు. ఎవరి ఇంటివద్దకు వెళ్లినా ఆదరించి భోజనం పెట్టేవారు. దుస్తులు తీయించేవారు. చిన్న వయసు పిల్లల నుంచి వృద్ధుల వరకు అందరికీ అలవాటయ్యాడు. ఆంగ్లేయుడిలా ఉన్న కారణంగా ‘బ్రిటీష్’ అని నామకరణం చేశారు. ప్రభుత్వ రికార్డుల్లోనూ అదే పేరు ఎక్కించి పింఛను వచ్చేలా చేశారు.
అనారోగ్యానికి గురై...
నెల రోజులుగా బ్రిటీష్ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. సుమారు 93 ఏళ్ల వయసు మీద పడడంతో శరీరం సహకరించక ఇబ్బందులు పడుతూ వస్తున్నాడు. కొందరు గ్రామస్తులు ధర్మవరం ఆస్పత్రిలో చూపించారు. చివరి రోజుల్లో చావిడికే పరిమితమయ్యాడు. శుక్రవారం రాత్రి కూడా గ్రామస్తులు పలకరించారు. తెల్లారేసరికి కన్నుమూశాడు.
మతాలు, కులాలకు అతీతంగా..
బ్రిటీష్ మృతి చెందాడనే సమాచారంతో గ్రామస్తులంతా ఏకమయ్యారు. మతాలు, కులాలకు అతీతంగా కలసికట్టుగా అంత్య క్రియల్లో పాల్గొన్నారు. అందరూ ఒకరి తర్వాత ఒకరు పాడె మోశారు. గ్రామంలో దాదాపు ప్రతి ఇంటికీ బ్రిటీష్‌తో అనుబంధం ఉంది. ఎక్కడో పుట్టి..ఇక్కడికి వచ్చి 42 ఏళ్ల పాటు అందరికీ సుపరిచితుడులా మారిన బ్రిటీష్ మరణాన్ని గ్రామస్తులు జీర్ణించుకోలేకపోయారు.


