మామిడి పూతపై గడ్డి మందు పిచికారీ
గార్లదిన్నె: మండలంలోని ఇల్లూరులో ఓ రైతును ఆర్థికంగా దెబ్బ తీసే కుట్రకు దుండగులు తెరలేపారు. పోలీసులు తెలిపిన మేరకు... బుక్కరాయసముద్రం గ్రామానికి చెందిన రైతు సుంకన్న ఇల్లూరులో రెండు ఎకరాల మామిడి తోటను కౌలుకు తీసుకుని సంరక్షణ చేపట్టాడు. ఈ క్రమంలో మామిడి పూత విరగ్గాసింది. దీంతో గిట్టని వారు పూతపై గడ్డిమందు పిచికారీ చేయడంతో ఎక్కడికక్కడ పూత రాలిపోయి, చెట్లు చనిపోతున్నాయి. ఘటనతో రూ.13 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధత రైతు వాపోయాడు. ఘటనపై బాధితుడి ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.


