ముదిరిన యానిమేటర్ వివాదం
పెద్దవడుగూరు: మండలంలోని జి.వెంకటాంపల్లిలో యానిమేటర్ల వివాదం చిలికిచిలికి గాలివానగా మారింది. మూడు నెలలుగా తలనొప్పిగా మారడంతో భరించలేక ఏపీఎం దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. ఈ క్రమంలో అక్రమాలు, ఆరోపణలపై శుక్రవారం వెలుగు అధికారులు ఆ గ్రామానికి చేరుకుని సంఘాల సభ్యులతో మాట్లాడుతుండగా ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు సకాలంలో అక్కడకు చేరుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.
అధికారం ఉందని..
రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చిరుద్యోగులను బలవంతంగా విధుల నుంచి తప్పించి టీడీపీకి చెందిన వారికి ఆయా బాధ్యతలను అప్పగించారు. ఈ క్రమంలోనే జి.వెంకటాంపల్లిలోని ఆశాజ్యోతి గ్రామైక్య సంఘానికి పదేళ్లకు పైగా యానిమేటర్‌గా సేవలు అందిస్తున్న పద్మావతిని తప్పించాలంటూ అధికారులపై స్థానిక టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. అయితే యానిమేటర్ పద్మావతిపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఆమె పనితీరు నిజాయితీతో కూడుకుని ఉండడంతో తొలగిస్తే వివాదం చెలరేగుతుందని ఏపీఎం నచ్చచెబుతూ వచ్చాడు. అయినా టీడీపీ నేతలు వినలేదు. అధికారంలో ఉన్నాం కాబట్టి తమ పార్టీకి చెందిన వారే యానిమేటర్‌గా ఉండాలని ఒత్తిళ్లు తీవ్రతరం చేశారు. దీంతో ఈ తలనొప్పి తనకెందుకని రెండు నెలల క్రితం ఏపీఎం దీర్ఘకాలిక సెలవులో వెళ్లిపోయాడు.
నిబంధనలు సాకు చూపి..
ఏపీఎం దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఐకేపీ అధికారులపై స్థానిక టీడీపీ నేతలు ఒత్తిళ్లు తీసుకెళ్లారు. పద్మావతి అవకతవకలకు పాల్పడుతోందనే కారణాన్ని చూపి ఆమెను తొలగించాలంటూ పార్టీ పెద్దల నుంచి హుకూం జారీ చేయించారు. దీంతో గ్రామ సంఘం తీర్మానం లేకుండానే మండల సమాఖ్య తీర్మానంతో పాత జీఓ మేరకు మూడేళ్లు యానిమేటర్‌గా పనిచేసిన వారిని విధుల నుంచి తొలగించవచ్చుననే నిబంధనతో పద్మావతిని పక్కకు తప్పించారు. అయితే ఆమె విధుల నుంచి తొలగించక ముందే ఆ పాత జీఓను చంద్రబాబు ప్రభుత్వం రద్దు చేసింది. అయినా వెలుగు అధికారులు పట్టించుకోకుండా పద్మావతిని తప్పించి ఆ బాధ్యతలను టీడీపీకి చెందిన వరలక్ష్మికి అప్పగించారు. అయినా వివాదం కొనసాగుతుండడంతో ఇద్దరినీ వెలుగు అధికారులు హోల్డ్‌లో ఉంచేశారు.
అక్రమాలు జరిగాయంటూ..
తాము పట్టుపట్టి నియమించుకున్న వరలక్ష్మిని అధికారులు హోల్డ్‌లో ఉంచేయడంతో టీడీపీ నేతలు మరింత రెచ్చిపోయారు. సమాఖ్య ఆర్థిక లావాదేవీల్లో పద్మావతి అక్రమాలకు పాల్పడిందంటూ ఫిర్యాదు చేశారు. దీనిపై శుక్రవారం వెలుగు అధికారులు గ్రామానికి చేరుకుని సంఘాల లీడర్లు, సభ్యులతో చేపట్టారు. 2014 నుంచి 2023 వరకూ సంఘం నిర్వహణ రికార్డులు అందుబాటులో లేకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. అయితే సమావేశానికి తప్పనిసరిగా హాజరు కావాల్సిన అధికారి నాలుగు గోడల మధ్య ఉంటూ సీసీలను పంపడంపై పలు అనుమానాలకు దారితీసింది. ఆ సమయంలోనే ఇరు వర్గాల వారు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని వాగ్వాదానికి దిగారు. పరిస్థితి ఉద్రిక్తతకు దారి తీయడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని చెదరగొట్టారు. దీంతో విచారణను వాయిదా వేసుకుని వెలుగు అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
యానిమేటర్ పద్మావతి ఇంటిపై దాడి
జి.వెంకటాంపల్లి గ్రామ యానిమేటర్ పద్మావతి ఇంటిపై శుక్రవారం రాత్రి టీడీపీకి చెందిన పలువురు దాడికి తెగబడ్డారు. గ్రామానికి చెందిన మహిళా సంఘం సభ్యులు కొందరు చేసిన ఫిర్యాదు మేరకు శుక్రవారం వెలుగు అధికారులు ఓబులేసు, మల్లికార్జున, వేణుగోపాల్, అబ్దుల్ ఖాదర్ విచారణ చేపట్టారు. మహిళా సంఘాల సభ్యులతో సమావేశమై మాట్లాడారు. అయితే రికార్డులు లేవని అధికారులు తెలపడంతో ఈ అంశంపై పద్మావతికి వ్యతిరేకంగా టీడీపీ వర్గానికి చెందిన కొందరు సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఇటీవల యానిమేటర్‌గా బాధ్యతలు స్వీకరించిన వరలక్ష్మి, ఆమె తండ్రి ఓబులేసు, మరికొందరు రాత్రి 9 గంటల ప్రాంతంలో పద్మావతి ఇంటిపై రాళ్లతో దాడి చేశారు. బాధితుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని ఇరువర్గాల వారిని అదుపులోకి తీసుకున్నారు.
అధికార బలంతో టీడీపీ వర్గీయుల దౌర్జన్యం
ఒత్తిళ్లు భరించలేక దీర్ఘకాలిక సెలవుపై ఏపీఎం.
బలవంతంగా యానిమేటర్‌ను తప్పించిన వైనం
అక్కడితో ఆగకుండా అక్రమాలు జరిగాయంటూ వేధింపులు
వెలుగు అధికారుల విచారణ సమయంలో పోలీసుల ఎదుట బాహాబాహీ


