అనంత వాసికి ట్రాఫిక్ పద్మవ్యూహం చుక్కలు చూపిస్తోంది. పది, ఇరవై నిమిషాల్లో చేరుకోవాల్సిన గమ్య స్థానాలకు కూడా గంటకు పైగా సమయం పడుతోంది. ఒక్కొక్కసారి ఈ సమస్య మరింత తీవ్రమవుతూ ఉంది. వ్యూహాత్మకదారుల అభివృద్ధి పథకం (ఎస్‌ఆర్‌డీపీ) అందుబాటులో ఉన్నా.. ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు చర్యలు చేపట్టకపోవడంతో అనంత నగర ప్రజలు నిత్యమూ ట్రాఫిక్ సుడిగుండంలో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నారు.
జిల్లాలో వాహనాల సంఖ్య సుమారు 12 లక్షలు
● చిక్కుకుంటే బయటపడటం కష్టం
అనంతపురం: ‘అనంత’లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి పోలీసులు తీసుకుంటున్న చర్యలు రెండు అడుగులు ముందుకు, నాలుగు అడుగులు వెనక్కి అన్నట్టుగా ఉన్నాయి. నగరంలో ఒకప్పడు గంటల్లో సాగిన ప్రయాణం గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో బహుముఖ వ్యూహంతో చేపట్టిన పనుల వల్ల నిమిషాల్లోనే ముగుస్తూ వచ్చింది. అప్పట్లో చేపట్టిన రహదారుల విస్తరణ పనులు నగర దారులను ప్రగతికి సోపానాలుగా మార్చేశాయి. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత క్రమంగా ట్రాఫిక్ కష్టాలు నగర వాసులను వెన్నాడుతూ వస్తున్నాయి. ప్రస్తుతం నిమిషాల్లో సాగిల్సిన ప్రయాణం... ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కుకుని గంటల సమయం పడుతోంది.
ప్రతి జంక్షన్ పద్మవ్యూహమే
జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ అస్తవ్యస్తంగా తయారైంది. నగరంలోని వ్యాపార కేంద్రాలు, ఆస్పత్రులు, రైల్వేస్టేషన్, బస్టాండు దగ్గర వాహనాల రాకపోకలు జఠిలంగా మారాయి. రుద్రంపేట సర్కిల్, కళ్యాణదుర్గం రోడ్డు సర్కిల్, బళ్లారి రోడ్డు సర్కిల్, సప్తగిరి సర్కిల్, క్లాక్ టవర్, సూర్యనగర్ సర్కిల్, పాతూరు సర్కిల్, గాంధీ బజార్, తిలక్ రోడ్డు, శ్రీకంఠం సర్కిల్ నుంచి పాతూరుకు వెళ్లే మార్గం, శ్రీకంఠం సర్కిల్ నుంచి ఆర్టీసీ బస్టాండుకు వెళ్లే దారి, బస్టాండు వద్ద ట్రాఫిక్ విపరీతంగా ఉంటోంది. ఆయా ప్రాంతాల్లో వ్యాపార కేంద్రాలు ఎక్కువగా ఉండడంతో దుకాణాలకు వచ్చే కొనుగోలుదారుల వాహనాలను పార్కింగ్ చేయడానికి స్థలం లేకపోవడంతో రోడ్డుపై ఉంచేస్తున్నారు. దీంతో గంటల తరబడి ట్రాఫిక్‌కు అంతరాయం నెలకొంటోంది. ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. వాహన చోదకులు అడ్డదిడ్డంగా దూసుకెళుతుండడంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ స్తంభిస్తోంది. అంబులెన్స్ వంటి అత్యవసర వాహనాలతో పాటు వృద్దులు, పిల్లలతో వెళ్తున్న వారి అవస్థలు వర్ణనాతీతం. ఇసుక టిప్పర్లు, భారీ వాహనాలు సైతం అనంతపురం నగరంలోని సప్తగిరి సర్కిల్, టవర్‌క్లాక్ మీదుగా వెళ్తున్నాయి. దీంతో రోడ్డు దాటాలంటే పాదచారులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. భారీ వాహనాలను రాత్రి సమయాల్లోనే నగరంలో ప్రవేశించేలా చర్యలు తీసుకోవడంలో పోలీస్ యంత్రాంగం విఫలమవుతోందనే ఆరోపణలున్నాయి.
వేల సంఖ్యలో వాహనాల రాకపోకలు
నగర పరిసర ప్రాంతాల నుంచి రోజూ 30 వేల మంది నగరంలోకి రాకపోకలు సాగిస్తుంటారు. వేల సంఖ్యలో ద్విచక్రవాహనాలు, ఆటోలు, బస్సులు, లారీలతో రోడ్లు కిక్కిరిస్తున్నాయి. అంతేకాక నగర విస్తరణ కూడా ట్రాఫిక్ సమస్య తీవ్రరూపం దాల్చుతోంది. ఇందుకు ఇరుకై న రోడ్లు ఓ కారణమైతే, సిగ్నల్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడం మరో కారణంగా తెలుస్తోంది. ఫలితంగా నగరంలోని ప్రధాన కూడళల్లో అరగంట వరకు రోడ్లపై ఆగిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాతూరులో గాంధీరోడ్డుతో పాటు, తిలక్ రోడ్డు, గాంధీ బజార్ విస్తరణకు నోచుకోలేకపోయాయి. దీంతో ఇబ్బందులు తప్పడం లేదు.
సంత వేళ నరకం
అనంతపురం వ్యవసాయ మార్కెట్ యార్డులో శని, ఆదివారాల్లో గొర్రెలు, మేకలు, పశువుల సంతలు నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజులూ కాపర్లు, వ్యాపారులు, రైతులు, చిరు వ్యాపారులు పెద్ద ఎత్తున వస్తుంటారు. మార్కెట్ యార్డు వద్ద పార్కింగ్ సదుపాయం లేకపోవడంతో సంతలు జరిగే రోజుల్లో జాతీయ రహదారిపైనే ఆటోలు, ద్విచక్రవాహనాలు, మినీ లారీలు, ట్రక్కులు ఆపాల్సి వస్తోంది. కోళ్లు, కొడవళ్లు, గొడ్డళ్లు, ఇతర సామాగ్రిని రహదారిపై విక్రయిస్తుంటారు. పశువులు, జీవాలను తరలించే వాహనాలు వందల సంఖ్యలో మార్కెట్ యార్డు నుంచి బయటకు వస్తుంటాయి. ఆ రెండ్రోజులు మార్కెట్ వద్ద ప్రయాణం వాహనదారులకు నరకం చూపిస్తోంది. విపరీత రద్దీతో ఆర్టీసీ బస్సులు నిదానంగా వెళుతుంటాయి.
గంటకు పైగా సమయం
నగరంలో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉంది. రుద్రంపేట సర్కిల్‌లో తరచూ ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేస్తుంటారు. సాయంత్రం అయితే ఎగ్జిబిషన్ సందర్శనకు వచ్చిన వారు తమ వాహనానలు రోడ్డు పక్కనే పార్కింగ్ చేస్తుంటారు. ఆ సమయంలో కియా కార్ల కంపెనీకి సంబంధించిన బస్సులతో పాటు కర్ణాటకు వెళ్లే లారీలు రోడ్డుమీదే ఆగిపోతున్నాయి. మూడు వైపులా ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడుతోంది. ఒక్కసారి ఇక్కడ ట్రాఫిక్‌లో చిక్కుకుంటే బయటపడేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. –ఎం. బాబాఖాన్, అనంతపురం
వాహనం అనివార్యం
గతంలో పోలిస్తే అనంతపురంలో వాహనాల సంఖ్య భారీగా పెరిగింది. అన్ని వర్గాల ప్రజలు ప్రస్తుతం ద్విచక్రవాహనాలు వినియోగిస్తున్నారు. దీనికి తోడు ఎప్పడుపడితే అప్పుడు భారీ వాహనాలు నగరంలోకి పట్టపగలే వస్తున్నాయి. భారీ వాహనాలను పగటి పూట నగరంలోకి రాకుండా నియంత్రించాల్సి ఉంది. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద ట్రాఫిక్ సమస్యతో నరకం చూస్తున్నాం. సప్తగిరి సర్కిల్, బస్టాండు, పాతూరు, శ్రీకంఠం సర్కిల్‌లో ట్రాఫిక్‌ను దాటుకుని వెళ్లాడమంటే యుద్ధం చేసినట్లే. – విష్ణువర్దనరెడ్డి, న్యాయవాది, అనంతపురం
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం
నగరంలో ట్రాఫిక్ పద్మవ్యూహం