
కాలవా.. నీటి కష్టాలు పట్టవా?
రాయదుర్గం టౌన్: ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు ఇలాకాలో తాగునీటి కష్టాలు రెట్టింపయ్యాయి. గుక్కెడు నీటి కోసం ప్రజలు ఖాళీ బిందెలతో తరచూ రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నా.. ఇటు అధికారుల్లో కానీ, అటు ప్రజాప్రతినిధుల్లో కానీ ఎలాంటి చలనం లేకపోవడంతో స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. పట్టణంలో కొన్నిచోట్ల వారం రోజులు, మరికొన్ని ప్రాంతాల్లో పది రోజులుగా తాగునీరు అందకపోవడంతో గత నెలలో వరుస ఆందోళనలతో రాయదుర్గం అట్టుడికిపోయింది. తాజాగా శుక్రవారం మరోసారి రాయదుర్గం – బళ్లారి ప్రధాన రహదారిపై బీజీ తిలక్ మున్సిపల్ హైస్కూల్ ఎదురుగా 30 వార్డు మహిళలు తాగునీటి కోసం ఖాళీ బిందెలతో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వారం రోజులకు పైగా నీరు సరఫరా చేయకపోతే తామెలా జీవించాలంటూ ప్రశ్నించారు. ఆధ్యాత్మిక ప్రచార ఆశ్రమం ఎదురుగా ఉన్న వీధిలో దాదాపు ఏడాదిగా తాగునీరు సక్రమంగా అందడం లేదని మండిపడ్డారు. సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాల్సిన మున్సిపల్ అధికారులు మొద్దు నిద్ర వీడడం లేదని, ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులుకు సైతం ప్రజల తాగునీటి కష్టాలు పట్టడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ డీఈ సురేష్, ఎస్‌ఐ ప్రసాద్, నీటి సరఫరా విభాగం సిబ్బంది అక్కడికి చేరుకుని ఆందోళన కారులతో చర్చించారు. ట్యాంకర్లు పంపి నీటి సమస్య పరిష్కరిస్తామని, క్షేత్రస్థాయిలో సమస్య గుర్తించి నీరు సక్రమంగా సరఫరా అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కాగా, మున్సిపల్ కమిషనర్ దివాకర్‌రెడ్డి మాట్లాడుతూ..శనివారం నుంచి పట్టణంలోని అన్ని కాలనీల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరుస్తామని పేర్కొన్నారు.
వరుస ఆందోళనలతో అట్టుడుకుతున్న రాయదుర్గం