ఉపశమనం కాదు.. ప్రత్యక్ష నరకమే | - | Sakshi
Sakshi News home page

ఉపశమనం కాదు.. ప్రత్యక్ష నరకమే

Aug 2 2025 6:28 AM | Updated on Aug 2 2025 6:28 AM

ఉపశమన

ఉపశమనం కాదు.. ప్రత్యక్ష నరకమే

కాలిన రోగుల హాహాకారాలు

వార్డుల కేటాయింపులో గందరగోళం

ఇదీ ప్రభుత్వ సర్వజనాస్పత్రిలో దుస్థితి

అనంతపురం మెడికల్‌: ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఉన్నతాధికారుల అవగాహన రాహిత్యం రోగులకు నరకప్రాయంగా మారుతోంది. కోవిడ్‌ ముందస్తు చర్యల కోసం ఈఎన్‌టీ వార్డును కేటాయించి.. ఇక్కడి రోగులను బర్న్స్‌ వార్డుకు మార్పు చేశారు. ఇక కాలిన రోగుల వైద్య విభాగం (బర్న్స్‌ యూనిట్‌)లో చికిత్స పొందాల్సిన రోగులను సర్జికల్‌ విభాగంలోని ఎంఎస్‌ 1, 2, 3, 4, 5, ఎఫ్‌ఎస్‌ వార్డులకు మార్చారు. ఇక్కడ సరైన సదుపాయాలు లేకపోవడంతో ఉపశమనం పొందలేక.. హాహాకారాలు చేస్తున్నారు. కోవిడ్‌ కేసులు వస్తే చికిత్స అందించేందు కోసం ఖాళీ చేయించిన ఈఎన్‌టీ వార్డును రిజర్వ్‌ చేశారు. ఇదిలా ఉంటే సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆత్మారాం బర్న్స్‌ వార్డులోని ఆపరేషన్‌ థియేటర్‌ (ఓటీ)ని అనస్తీషియా విభాగానికి కేటాయించడం పెద్ద దుమారం రేపింది. ఈ నిర్ణయంపై సర్జరీ హెచ్‌ఓడీ డాక్టర్‌ రామస్వామి నాయక్‌ అభ్యంతరం తెలిపారు. కాలిన రోగులకు ఉపయోగపడే ఓటీని మరో విభాగానికి కేటాయించడం సరికాదని, ఇప్పటికే కాలిన రోగులు ఇబ్బందులు పడుతున్నారని లేఖ రాశారు. సూపరింటెండెంట్‌ సొంత విభాగం ఆర్థో ఓటీలోనే అనస్తీషియాకు స్థలం కేటాయిస్తే బాగుంటుందని పలువురు వైద్యులు పేర్కొంటుండటం గమనార్హం.

ఉక్కపోతతో కాలిన రోగుల అవస్థలు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైనా ప్రమాదాలు, ఆత్మహత్యాయత్నం చేసుకున్న కాలిన కేసులు ప్రభుత్వ సర్వజనాస్పత్రికి వస్తాయి. అందులోనూ 50 శాతం నుంచి 80 శాతం కాలి ప్రాణాంతకమైన స్థితిలో వస్తుంటాయి. అటువంటి బాధితులకు మెరుగైన వైద్యం అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ నిధులు రూ.2 కోట్లతో 20 పడకల సామర్థ్యంతో బర్న్స్‌ వార్డు ఏర్పాటు చేశారు. అందులో అధునాత ఆపరేషన్‌ థియేటర్‌, ఐసీయూ, ఏసీ గదులతో వార్డును తీర్చిదిద్దారు. కాలిన కేసులకు మెరుగైన వైద్యం అందించేందుకు సర్జరీ వైద్యులకు ఢిల్లీలో శిక్షణ కూడా ఇచ్చారు. అత్యవసరమైన వార్డును ఈఎన్‌టీకి కేటాయించి, ఈఎన్‌టీ వార్డును ఖాళీగా ఉంచేశారు. సర్జరీ విభాగంలో ఉక్కపోత కారణంగా కాలిన రోగులు విలవిలలాడిపోతున్నారు. ఇప్పటికై నా రోగుల అవస్థలను గుర్తించి ఇదివరకు ఎలా ఉందో అలా సంబంధిత విభాగంలోనే వైద్య సేవలందించాలని పలువురు కోరుతున్నారు. అసంబద్ధ నిర్ణయాలతో రోగుల ప్రాణాలతో చెలగాటమాడవద్దని ఉన్నతాధికారులకు సూచిస్తున్నారు.

ఈ వ్యక్తి పామిడి మండలం రామరాజుపల్లికి చెందిన నాగేశ్వర్‌రెడ్డి. ఎడమచేతికి కాలడంతో సర్వజనాస్పత్రికి వచ్చారు. కాగా ఓపీ నంబర్‌ 8లో సర్జరీ వైద్యులు చూసి సర్జికల్‌ వార్డుకు పంపించారు. వాస్తవంగా ఇటువంటి కేసులను బర్న్స్‌ వార్డులో ఉంచి మెరుగైన వైద్యం అందించవచ్చు. బర్న్స్‌ వార్డులో ఏసీలతో పాటు బయట వ్యక్తులు ఎవరూ లోపలికి రాకుండా అంతర్గతంగా సేవలందిస్తారు. తద్వారా గాయం త్వరగా మానే అవకాశం ఉంటుంది. ఇలా ఎంతోమంది రోగులు సర్జరీ వార్డుల్లో ఉక్కపోతతో ప్రత్యక్ష నరకం చూస్తున్నారు.

ఉపశమనం కాదు.. ప్రత్యక్ష నరకమే 1
1/1

ఉపశమనం కాదు.. ప్రత్యక్ష నరకమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement