
రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలి
అనంతపురం అర్బన్: బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ సక్రమంగా చేపట్టాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని నవోదయ కాలనీలోని చౌక ధరల దుకాణాన్ని ఆయన సందర్శించి రేషన్ పంపిణీని తనిఖీ చేశారు. రేషన్ పంపిణీపై కార్డుదారులను ఆరా తీశారు. బియ్యంతో పాటు కందిపప్పు కూడా ఇవ్వాలని కార్డుదారులు కోరారు. అనంతరం ఇన్‌చార్జ్ కలెక్టర్ మాట్లాడుతూ కార్డుదారులకు కచ్చితమైన తూకంతో బియ్యం ఇవ్వాలన్నారు. తక్కువ తూకం వేస్తే చర్యలు ఉంటాయని డీలర్లను హెచ్చరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ హరికుమార్, వీఆర్‌ఓ రామాంజనేయులు పాల్గొన్నారు.
ఇళ్ల వద్దే పింఛన్ పంపిణీ చేయాలి
లబ్ధిదారుల ఇళ్లవద్దకే వెళ్లి పింఛను పంపిణీ చేయాలని ఇన్‌చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత సచివాలయ సిబ్బందిని ఆదేశించారు. ఇన్‌చార్జ్ కలెక్టర్ స్థానిక నవోదయ కాలనీలో ఉమాదేవి, గుశాంతప్ప ఇళ్లకు వెళ్లి పింఛను అందజేశారు. ఏవైనా సమస్యలు ఉంటే చెబితే ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందేలా చూస్తామన్నారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ పావని, తహసీల్దార్ హరికుమార్, తదితరులు పాల్గొన్నారు.